Bandla Ganesh Property High Court
* రూ.8.50 కోట్ల ఆస్తి వేలం సరైందే
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫాం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు తీసుకున్న వేలం నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
* అసలేం జరిగిందంటే..
శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫాం ప్రైవేట్ లిమిటెడ్ పేరిట తీసుకున్న రుణాన్ని బండ్ల గణేష్ బకాయి పడ్డారు. దీనితో స్పందించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బకాయిల వసూలు కోసం జూబ్లీహిల్స్‌లో ఉన్న బండ్ల గణేష్‌కు చెందిన ఆస్తిని రూ. 8.50 కోట్లకు వేలం వేసింది.
* DRT ఇచ్చిన ఊరట.. హైకోర్టులో రివర్స్..
బ్యాంక్ తీసుకున్న ఈ వేలం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ గతంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన DRT.. బండ్ల గణేష్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే, డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఈ తీర్పును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. DRT ఆదేశాలను సవాల్ చేస్తూ బ్యాంక్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
* హైకోర్టు కీలక తీర్పు..
ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలను నిశితంగా విన్న ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. గతంలో బండ్ల గణేష్‌కు అనుకూలంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అప్పుల రికవరీ కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తులను వేలం వేయడం సరైన నిర్ణయమేనని స్పష్టం చేస్తూ, బ్యాంకుకు సానుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో నిర్మాత బండ్ల గణేష్‌కు మరోసారి చట్టపరమైన ఇబ్బందులు తప్పేలా లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
