బస్తర్ ఒలింపిక్స్
* 6 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు
* 7 జిల్లాల్లో 11 క్రీడాంశాల్లో పోటీలు
ఆకేరు న్యూస్, బస్తర్: మారుమూల గ్రామాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న బస్తర్ ఒలింపిక్స్‌కు ఈ ఏడాది భారీ స్పందన లభించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఏడు జిల్లాల్లో నిర్వహిస్తున్న ఈ క్రీడా వేడుకలో పాల్గొనేందుకు ఆరు లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇందులో 3,83,094 మంది మహిళలు, బాలికలు ఉండటం విశేషం. పురుషులు, బాలురతో పోలిస్తే మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మహిళలే అధికం
అక్టోబర్ 1 నుంచి 30 వరకు నిర్వహించిన రిజిస్ట్రేషన్లలో 3,83,094 మంది మహిళలు, బాలికలు, 2,18,398 మంది పురుషులు, బాలురు పేర్లు నమోదు చేసుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే కాంకేర్‌లో అత్యధికంగా 1,23,216 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. బస్తర్‌లో 1,04,841, కొండగావ్‌లో 85,584, సుక్మాలో 80,313, దంతేవాడలో 80,175 మంది నమోదు చేసుకున్నారు. నారాయణ్‌పూర్‌లో 63,506, బీజాపూర్‌లో 62,857 మంది పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు.
11 క్రీడాంశాల్లో పోటీలు
బస్తర్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్, కరాటే, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ వంటి 11 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. బ్లాక్, జిల్లా, డివిజన్ స్థాయిల్లో మూడు దశలుగా పోటీలను ఏర్పాటు చేశారు. జూనియర్ విభాగంలో 14 నుంచి 17 ఏళ్ల బాలురు, బాలికలకు అవకాశం కల్పించగా.. సీనియర్ విభాగంలో పురుషులు, మహిళలకు గరిష్ఠ వయోపరిమితి లేదు.
బాధితులకు ప్రత్యేక అవకాశం
మావోయిస్టు హింస కారణంగా వైకల్యానికి గురైన వ్యక్తులు, లొంగిపోయిన మావోయిస్టు కార్యకర్తలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. వీరు బ్లాక్, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనకుండానే నేరుగా డివిజన్ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఘర్షణలతో ప్రభావితమైన ప్రాంతాల్లోని ప్రజలను క్రీడల వైపు ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.
డిసెంబర్ 7 నుంచి తుది పోటీలు
బ్లాక్ స్థాయి పోటీలు నవంబర్ 4 నుంచి 6 వరకు పూర్తయ్యాయి. జిల్లా స్థాయి పోటీలను నవంబర్ 16 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. అనంతరం డిసెంబర్ 7 నుంచి 11 వరకు జగదల్పూర్లో డివిజన్ స్థాయి పోటీలు జరగనున్నాయి. ప్రతి జిల్లా నుంచి అర్హత సాధించిన 410 మంది క్రీడాకారులు డివిజన్ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
ప్రతిభకు ప్రోత్సాహం అవసరం
బస్తర్ ఒలింపిక్స్ కేవలం క్రీడా పోటీలకే పరిమితం కాకుండా మారుమూల ప్రాంతాల యువతకు కొత్త అవకాశాలను అందించే వేదికగా నిలుస్తోంది. ముఖ్యంగా మహిళలు, బాలికలు భారీ సంఖ్యలో పాల్గొనడం సానుకూల పరిణామం. అయితే ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు నిరంతర శిక్షణ, మెరుగైన మైదానాలు, పోషకాహారం, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తే మరింత మంది క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. బస్తర్ ప్రాంతంలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయికి పరిచయం చేయడంలో ఈ ఒలింపిక్స్ ఎంతవరకు విజయవంతమవుతాయో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

