* కాళోజీ కళాక్షేత్రంలోకి కుడా కార్యాలయం
* వేలం వేసేందుకు త్వరలో నోటిఫికేషన్
* హోటల్లు, హాస్పిటల్స్ , సాఫ్ట్ వేర్ కంపెనీల ఆసక్తి
ఆకేరు న్యూస్ ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ కార్యాలయాలను అద్దెకు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ( కుడా ) కార్యాలయాన్ని లీజ్ కు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. త్వరలోనే టెండర్ పిలిచేందుకు కుడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హోటల్లు, ఆస్పత్రులు , సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు కుడా అధికారులను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. మునిసిపల్ ఎన్నికల అనంతరం కుడా కార్యాలయాన్ని లీజ్ కు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వేలం పాట నిర్వహించి ఎక్కువ మొత్తం పాడిన వారికి కుడా ఆఫీస్‌ను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం నడిబొడ్డున హనుమకొండ చౌరస్తా సమీపంలో ఈ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయానికి అతి చేరువలోనే స్టార్ హోదా ఉన్న భారీ హోటల్ , ఏకశిల సూపర్ స్పెషాలిటి హాస్పిటల తో పాటు భారీ సంఖ్యలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. దీంతో కుడా పరిసర ప్రాంతమంతా భారీ డిమాండ్ ఉన్న కమర్షియల్ ఏరియాగా మారిపోయింది. దీంతో కుడా కార్యాలయ భవనానికి భారీ డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
* కాళోజీ కళాక్షేత్రంలోకి కుడా ఆఫీస్
కుడా కార్యాలయాన్ని అద్దెకు ఇచ్చి బాల సముద్రంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రంలోకి మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కుడా కార్యాలయ అవసరాలకు మించి విశాలంగా ఉందని అధికారులు భావిస్తున్నారు. కాళోజీ కళా క్షేత్రంలో తక్కువ స్థలం ఉన్నప్పటికీ కార్యాలయ నిర్వహణకు అనుగుణంగా మార్చుకుంటామన్న భావనలో అధికారులు ఉన్నారు. కాళోజీ కళా క్షేత్ర నిర్వహణ సైతం తలకు మించిన భారంగా మారుతోందంటున్నారు. నెల వారిగా ఖర్చు ఏకంగా రూ. 9 లక్షలు అవుతోంది. అందులో దాదాపు విద్యుత్ బిల్లు నెలకు అక్షరాల ఐదులక్షలు వస్తుందంటున్నారు. కుడా కార్యాలయ భవనం అందులోకి మార్చడం ద్వారా కాళోజీ కళా క్షేత్రం నిర్వహణ కూడా సులభం అవుతుందని అధికారులు భావిస్తున్నారు..
* ప్రభుత్వ కార్యాలయం అద్దెకు ..?
ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రైవేట్ కంపెనీలకు అద్దెకు ఇవ్వాలన్న నిర్ణయం వివాదాస్పదమయ్యే అవకాశాలు లేకపోలేదు. కుడా కార్యాలయం కాళోజీ కళాక్షేత్రంలోకి మారడం వల్ల కళా క్షేత్రానికి ఆర్థిక పరిపుష్టి ఏ విదంగా కలుగుతుందో తేలాల్సి ఉంది. కమర్షియల్‌గా భారీ డిమాండ్ ఉండే ఇలాంటి స్థలానికి సంబందించి అధికార పార్టీ నేతల అనుంగు అనుచరులు రంగంలోకి దిగే అవకాశాలు లేక పోలేదంటున్నారు. ఇప్పటికే బాల సముద్రంలోని అత్యంత ఖరీదైన రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేసేందుకు కుడా ప్రయత్నాలు చేసింది. రాజకీయ పక్షాలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. కుడా కార్యాలయ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ఈ నిర్ణయం మరో సారి వివాదాస్పదమయ్యే అవకాశాలు లేక పోలేదు.
——————————————————–
