
* ఈతకని వెళ్లిన కవలలు మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కవలలుగా కలిసి పుట్టారు.. కలిసి చనిపోయారు.. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లాతిమ్మకుపల్లి (timmakupalli) లో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం తిమ్మకుపల్లి గ్రామానికి చెందిన మేస్త్రీ పనిచేసే గుర్రాల పెద్ద నర్సింలు – బీడీ కార్మికురాలు మంజుల దంపతులకు రామ్, లక్ష్మణ్ (Ram, Lakshman) (13) అనే కవలలు ఉన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి బయటకు వెళ్తున్నామని చెప్పి, సమీపంలోని చెరువుకు స్నానానికి వెళ్లారు. చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక ఇద్దరూ మునిగిపోయి గల్లంతయ్యారు. రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు గ్రామంలో వెతికి, స్నేహితుల వద్ద ఆరా తీసి, ఎక్కడా కనిపించకపోయేసరికి ఆందోళనకు గురయ్యారు. గ్రామ శివారులో గల కుంట వద్ద ఇద్దరు చిన్నారుల బట్టలు ఒడ్డుపై ఉన్నాయని తెలియడంతో ఇక్కడి వెళ్లి చేసి, ఆ బట్టలు తమ పిల్లలవే అని రోదించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు కుంటలో గాలించారు. సోమవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఒకరి మృతదేహం, మంగళవారం ఉదయం మరొకరి మృతదేహం లభించింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. మృతుల తండ్రి పెద్ద నర్సింలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కవల సోదరుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
……………………………………….