Ramchander Rao BRS Criticism
* ప్రజా సమస్యలు వదిలేసి ఫ్యామిలీ మ్యాటర్స్ పై రాద్ధాంతం?
* ముందస్తు బెయిల్ పారిపోవడం కాదు, చట్టబద్ధ హక్కు
* లిక్కర్ స్కామ్, నిర్మల్ దారుణాల సంగతి ఏంటి
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
అధికారంలో ఉన్నప్పుడు మహిళల హక్కులను కాలరాసి, నేడు వారి గురించి మాట్లాడటం బీఆర్ఎస్ నేతల ద్వంద్వ నీతికి అద్దం పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మహిళలపై అనేక అరాచకాలు జరిగినా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదని, కేసీఆర్ కుటుంబానికి చెందిన ఒక మహిళ లిక్కర్ స్కామ్లో కోట్లాది రూపాయల కమీషన్లు తీసుకుని జైలుకు వెళ్లడం నేరం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేస్, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతామోననే భయంతోనే బీఆర్ఎస్ నేతలు బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ పాలనలో ఇంటర్మీడియట్ తప్పుడు ఫలితాల కారణంగా 29 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ చావులన్నింటికీ కేటీఆరే బాధ్యుడని రామచందర్రావు ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుటుంబ సమస్యలను, ఒక మైనర్ బాలిక కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, లీగల్, సోషల్ మీడియా, రిటైర్డ్ పోలీస్ అధికారులతో కలిసి ఒకరి కుటుంబ వ్యవహారాలపై రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక, కోట్లు ఖర్చు పెట్టి మరీ పోస్టర్లతో బురదజల్లుతున్నారని ఆరోపించారు. చట్ట ప్రకారం ఎవరైనా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం వారి చట్టబద్ధమైన హక్కని, దాన్ని పారిపోవడంగా చిత్రీకరించడం బీఆర్ఎస్ దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇతరులపై విమర్శలు చేసే కేటీఆర్.. 2022 మే నెలలో నిర్మల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు చేసిన దారుణాలపై ఆనాడు అధికారంలో ఉన్న కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని రామచందర్రావు డిమాండ్ చేశారు.
