* అపుడు – 4 ఇపుడు 8 సీట్లు
* సిట్టింగ్‌ల సీట్లు పదిలమే
* నరేంద్ర మోది చరిష్మా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో కమలం (BJP ) వికసించింది. గులాబీ (BRS) మాత్రం వాడిపోయింది. ఇక హస్తం ( Cgngress Party ) హవా మాత్రం పెరిగింది. 2019 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ , బీజేపీలు తమ బలాన్ని పెంచుకోగా బీఆర్ ఎస్ మాత్రం పూర్తిగా చతికిల పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టిన గులాబీ పార్టీని పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు దారుణంగా దెబ్బతీశాయి. బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఉత్సాహంగానే కనిపిస్తున్నాయి.
* తెలంగాణ లో కమల వికాసం
2019 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే రెట్టింపు బలాన్ని బీజేపీ కూడగట్టుకున్నది. అపుడు నాలుగు పార్లమెంట్ సీట్లను మాత్రమే గెలుచుకున్నది. ఇపుడు మరో నాలుగు అంటే మొత్తం ఎనిమిది స్థానాల్లో బీజీపీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ అరవింద్ , సికింద్రాబాద్ కిషన్ రెడ్డి లు గెలుపొందారు. ఈ నాలుగు స్థానాల్లో ఒక అభ్యర్థిని మార్చారు. ఆదిలా బాద్ నియోజకవర్గానికి సోయం బాబురావు స్థానంలో నగేష్‌ను నిలబెట్టారు. ఇక్కడ కూడా గెలుపొందారు. అదనంగా మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ , మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ , చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి లు గెలుపొందారు.
* ఎమ్మెల్యేలుగా ఓడి ఎంపీలుగా గెలిచారు
బండి సంజయ్ , అరవింద్‌లు సిట్టింగ్ ఎంపీలుగా ఉండి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరితోపాటు దుబ్బాక నుంచి రఘునందన్ రావు, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి చెందారు. అయినప్పటికీ మరో సారి పార్లమెంట్ బరిలో నిలిచి సత్తా చాటారు.
* భాగ్యనగర్ మహాలక్ష్మీ కరుణించలేదా..
హైదరాబాద్ పాత బస్తీలో పాగా వేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ముస్లీం ఓటర్లు అత్యధికంగా ఉండే హైదరాబాద్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నం చేసింది. ప్రధాని నరేంద్రమోది, అమిత్ షాలు మొదలు బడా నేతలంతా చార్మినార్ పక్కనే ఉన్న మహాలక్ష్మీ ఆలయం నుంచి రాజకీయ కార్యక్రమాలు మొదలు పెట్టారు. మహాలక్ష్మీ ఆలయం కూడా అయోధ్య లాగా ఒక రాజకీయ క్షేత్రంగా మారునుందా అన్న అనుమానాలు అప్పట్లో తలెత్తాయి. అన్నిటికి మించి పాత బస్తీలో ఎదురులేని నేతగా ఎదిగిన అసదుద్దీన్ ఓవైసీని ఓడించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ముస్లీం వర్గా ల బలమైన గొంతుకగా ఉన్న అసదుద్దీన్ పరాజయం పాలయితే దేశవ్యాప్త చర్చకు దారీ తీసేది. ఇందుకోసం ఏకంగా ప్రజల్లో అద్భుతంగా కలిసి పోయే మాధవిలతను అసదుద్దీన్ పై పోటీకి నిలిపారు. ఉపన్యాసాలతో, విభిన్న ప్రచారంతో ప్రజలను ఆకట్టుకున్న మాధవిలత గెలుపు దిశగా పయనిస్తుందన్న చర్చ జరిగింది. అయినప్పటికి అసదుద్దీన్ మూడు లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. భాగ్యనగర్ మహాలక్ష్మీ కరుణించలేదేమో అని బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి.
మోది చరిష్మా గెలుపు మంత్రం
నరేంద్ర మోది చరిష్మా ఉత్తరాదిలో కొంత తగ్గినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భాగా పనిచేసినట్టు కనిపిస్తోంది. నరేంద్ర మోది తాను పదేండ్ల కాలంలో చేసిన అభివృద్దిని ప్రజలకు తనదైన పద్దతిలో వివరించారు. గేరు మార్చి ఈ సారి స్థానిక అంశాలను ఎక్కువగా ప్రస్తావించారు. దీంతో పాటు తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై నేరుగా విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ పరోక్షంగా దాడి చేశారు. ప్రజలు నిరంతరం మాట్లాడుకునే అంశాలనే ప్రస్తావించారు. తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఫలితంగా బీజేపీ గతం కంటే రెట్టింపు సీట్లను గెలుచుకోగలిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
————————————————-