BRS leaders staged a road blockade in Maripeda
* మరిపెడలో బీఆర్ఎస్ రాస్తారోకో
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలైన ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’లను ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తా రోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై నిర్వహించిన ఈ ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి రెడ్యానాయక్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నో చారిత్రాత్మక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు లక్షలాది కుటుంబాలకు ఆసరాగా నిలిచాయని తెలిపారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజా పాలన’ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ, పేదలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ఒక్కొక్కటిగా కోత విధించే కుట్రకు తెరలేపిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదల కంటిపాపలాంటి సంక్షేమ పథకాలను రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించకపోతే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా పెద్ద ఎత్తున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వం హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ప్రజలే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
