MLA Padi Kaushik Resignation Challenge
* కేసీఆర్ కన్న ఎక్కువ అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే..
* దమ్ముంటే చర్చకు రండి..
* హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
* 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆరఎస్ నిరసన
* కమలాపూర్‌లో వంటా-వార్పు
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
మాజీ సీఎం కేసీఆర్ కంటే ఏ ఒక్క రంగంలోనైనా ఎక్కువ అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే క్షమాపణ చెబుతారా ? అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన హామీల అమలు విఫలమైందంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భారీ నిరసన ర్యాలీ, వంటా-వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ కూడలి వద్ద కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అనంతరం బస్టాండ్ ఆవరణలో వంటా-వార్పు నిర్వహించి ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంద రోజుల్లో ఇస్తామన్న కాంగ్రెస్ గ్యారెంటీలు, వెయ్యి రోజులైనా అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
* డబుల్ ఇళ్లు, కమలాపూర్ బస్టాండ్ నిర్మాణంపై విమర్శలు
కమలాపూర్‌లో కేసీఆర్ హయాంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారం రోజుల్లోగా లబ్ధిదారులను పంపిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ మాట నిలబెట్టుకోలేదని కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులను ఎందుకు లోపలికి పంపట్లేదని ప్రశ్నించారు. రూ. 20 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తే, కనీస అవసరాల కోసం 4 కోట్ల 92 లక్షలు రిలీజ్ చేసినా టెండర్లు వేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను గుర్తు చేస్తూ ఒక కోటి 75 లక్షలతో చేపట్టాల్సిన కమలాపూర్ బస్టాండ్ నిర్మాణాన్ని అసెంబ్లీలో పదేపదే ప్రస్తావించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పటికీ కమలాపూర్ బస్టాండ్ నిర్మాణం అసంపూర్తిగానే మిగిలిపోయిందనీ ఎమ్మెల్యే అన్నారు.
* రూ.1400 కోట్ల విరాళాలు, అవినీతి ఆరోపణలు
బీఆరఎస్ పార్టీకి దేశ, విదేశాల నుంచి డొనేషన్ల రూపంలో వచ్చిన రూ. 1400 కోట్లపై మంత్రులు విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే సంకల్పంతో వ్యాపారవేత్తలు, అభిమానులు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలు అవి అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని స్వయంగా కొందరి మంత్రులపైనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, ఒక మంత్రి కుమార్తెకు 200 కోట్ల విలువైన భూమిని కేవలం 7 కోట్లకే కట్టబెట్టారని, కాంగ్రెస్ మంత్రులపైనే 30 శాతం కమిషన్ ఆరోపణలు ఉన్నాయని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల పాలనలో అవినీతి పెరిగిపోయిందని, భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద శాతం బీఆరఎస్ అధికారంలోకి వస్తుందని కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీఆరఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
