* సర్కారు ఆరోపణలపై కౌంటర్లకు సిద్ధం
* ప్రాజెక్టు ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తున్నకేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ (Telangana) కు కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram project)పై ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల మధ్య కొద్దిరోజులుగా పోరు సాగుతూనే ఉంది. కేవలం కమీషన్లు కోసమే ప్రాజెక్టును నిర్మించారని, వారి దోపిడీకి కాళేశ్వరం బలైందని అధికార పక్షం మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఎన్నికల ముందే మేడిగడ్డ (Medigadda) కుంగడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ (Congress party) కి ఆ అంశం ఓ వరంగా మారింది. గెలుపులోనూ సహాయపడింది. ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డను సందర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టులోని లోపాలను ఎత్తిచూపుతూ ఇందుకు గత ప్రభుత్వ ధన దాహమే కారణమంటూ ఆరోపిస్తోంది. ఇటీవల ఢిల్లీ(Delhi)లో సమావేశం ఏర్పాటు చేసి మరీ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttamkumar Reddy) తీవ్ర స్థాయిలో కేసీఆర్ (KCR) పైనా, గత ప్రభుత్వ విధానాలపైనా విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్ (KTR) వెనువెంటనే స్పందించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలు తలెత్తడం సహజమని, సరిదిద్ది ప్రాజెక్టును పునర్వినియోగంలోకి తేవాలి కానీ రాజకీయ ప్రాబల్యం కోసం కాలయాపన చేయడం తగదని బదులిచ్చారు.
కాళేశ్వరం పర్యటన
ఇప్పటి వరకూ స్టేట్మెంట్లు, సమావేశాల్లో ప్రభుత్వానికి సమాధానం చెబుతున్న ప్రతిపక్షం ఇక నేరుగా రంగంలోకి దిగింది. నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ ఎస్ (KCR) అధినేత కేసీఆర్ (KCR) మాట్లాడుతూ, ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇవ్వాలనుకున్నామని, ఇకపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాతామని హెచ్చరించారు. ఆమేరకు కార్యాచరణలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs), ఎమ్మెల్సీ (MLCs)ల కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) సందర్శన రెండో రోజు కొనసాగుతున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Party Working President KTR) నేతృత్వంలో హైదరాబాద్ (Hyderabad) నుంచి బయల్దేరిన ప్రజా ప్రతినిధుల బృందం.. గురువారం సాయంత్రం కరీంనగర్ (Karimnagar) లో లోయర్ మానేరు రిజర్వాయర్ (Lower Maneru Reservoir) ను పరిశీలించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం రామగుండం ఎన్టీపీసీ (Ramagundam NTPC) నుంచి కన్నెపల్లి (Kannepalli) కి బయల్దేరి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం కన్నెపల్లి పంపు హౌజ్‌కు చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. అక్కడ గోదావరి నది ఉధృతిని పరిశీలించారు. సర్కారు ఆరోపణలపై దీటైన కౌంటర్లకు కేటీఆర్ సిద్ధం అవుతున్నారు. ఈమేరకు ప్రాజెక్టు ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ నివేదిక సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.
————————–