* ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు
* రేషన్కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే
* లేకుంటే ఉచిత రేషన్ పంపిణీని ఆపేస్తాం
* కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరిక
ఆకేరున్యూస్,కరీంనగర్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ’ఇందిరమ్మ’ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్‌కార్డులు ఇవ్వబోమన్నారు. తామే ముద్రించి ప్రజలకు రేషన్‌కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ మీద ఆయన విమర్శలు గుప్పించారు. కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రధాని మోదీ ఫొటో ముద్రించాల్సిందేనని అన్నారు. రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో పెట్టకపోతే ఉచిత బియ్యం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రధాని ఫొటో పెట్టకపోతే పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామన్నారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు భాజపాలో చేరిన అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. ‘ఎప్పుడు ఎన్నికలు జరిగినా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీదే అన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చినా గత పదేళ్లలో ఏనాడూ బీఆర్ఎస్ నేతలు నన్ను పిలవలేదు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు నేను నిధులు తీసుకొస్తే.. వాళ్లు పనులు ప్రారంభించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిధులను దారిమళ్లిస్తే.. కొట్లాడి మరీ అడ్డుకున్నానని అన్నారు. కరీంనగర్ కోసం ఎంత కష్టపడినప్పటికీ నన్ను ఏనాడూ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండా దూరంపెట్టారన్నారు. మోదీ ప్రభుత్వం అందించిన నిధులతోనే కరీంనగర్లో అభివృద్ధి జరిగిందని ప్రజలకు అర్థమైందని.. మాజీ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తున్నారు‘ అని బండి సంజయ్ దుయ్యబట్టారు.
………………………………………