
* పాలకుల వివక్షపై ప్రచారం
* ఏడాదిన్నరైనా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ జాప్యం
* టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
ఆకేరు న్యూస్, వరంగల్ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో పాలకుల వివక్షను ఎత్తిచూపుతూ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య వెల్లడించారు.
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. శనివారం వరంగల్ (Warangal) లోని కెమిస్ట్రీ భవన్ లో టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా తృతీయ మహాసభ విజయవంతంగా జరిగింది. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, జర్నలిస్టుల (Journlists) సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల జన చైతన్య యాత్ర చేస్తామని, ప్రజల మద్దతు కోరతామని ప్రకటించారు. రాష్ట్రంలో మెజారిటీ జర్నలిస్టుల జీవన స్థితిగతులు దయనీయంగా మారుతున్నాయన్నారు, ముఖ్యంగా మండలస్థాయి విలేకరుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులందరికీ ఉపయోగపడాల్సిన మీడియా అకాడమీ(Miedia Acadamy) ని ఆ యూనియన్ లు తమ జేబు సంస్థగా మార్చుకున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని, రాష్ట్రంలో చాలా ఏళ్ళుగా నడుస్తున్న అనేక చిన్న పత్రికలను ప్రభుత్వం గుర్తించకుండా అణచివేస్తున్నదని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న అన్ని చిన్న పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలన్న నిబంధనను పాలకులు తుంగలో తొక్కి దొడ్డిదారిన పైరవీలకు ప్రాధాన్యమిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాబోయే రెండు మూడు మాసాల్లో అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ మహాసభలు పూర్తి చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభ నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, వల్లాల జగన్,రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ లు మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫెడరేషన్ ను మరింత బలోపేతం చేయాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ (TwjF) సంఘం జర్నలిస్టుల సమస్యలపై నిరంతం పోరాడుతూ, జర్నలిస్టులకు అండగా ఉంటుందని వారన్నారు. సీనియర్ జర్నలిస్టు, ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జక్కుల విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో స్థానిక కార్పొరేటర్ బస్వరాజ్ కుమార్, ఫెడరేషన్ వరంగల్ జిల్లా కార్యదర్శి బొట్ల స్వామిదాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొలుమారి గోపాల్, చుంచు అయిలయ్య, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి మధు, జనగామ జిల్లా అధ్యక్షుడు నీల నరేష్ బాబు, సీనియర్ జర్నలిస్టు సానిక్ తదితరులతో పాటు వివిధ పత్రికలు,చానళ్ళకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వరంగల్ నూతన కార్యవర్గం ఎన్నిక..
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వరంగల్ జిల్లా తృతీయ మహాసభలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్ (మెట్రో ఈవినింగ్), జిల్లా కార్యదర్శిగా బొట్ల స్వామిదాసు (నవభారత్), కోశాధికారిగా భానోత్ సురేష్ (మెట్రో), ఉపాధ్యక్షులుగా వెల్ది రాజేందర్ (ప్రజాదర్బార్), కుర్మిల్ల దుర్గారావు (మనం), సహాయ కార్యదర్శులుగా బావుండ్లపల్లి కిరణ్ (నవతెలంగాణ), ఆకోజు సాంబయ్య (ఆర్టిఐ నీఘా), బాదం సురేష్ (వాయిస్ ఆఫ్ వార్డ్), జిల్లా కార్యవర్గ సభ్యులుగా స్వామిదాసు (మెట్రో), సైదులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పాలడుగు సురేందర్ (అక్షిత), అడువ నర్సింగరావు (సూర్య), జాతీయ కౌన్సిల్ సభ్యులుగా బుడిగి మల్లేశం (మనం) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
………………………………………………….