
* విద్యార్థులకు పాఠాలు చెప్పిన బాబు
* ఏపీలో మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్
ఆకేరు న్యూస్, సత్యసాయి జిల్లా : ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో పండుగ వాతావరణం వెల్లివిరుస్తోంది. విద్యార్థులే కాకుండా తల్లిద్రండులతో విద్యాలయాలు కళకళలాడుతున్నాయి. మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్ (PTM) ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 61,135 విద్యా సంస్థలలో రికార్డు స్థాయిలో 2,28,21,454 మంది పాల్గొనేలా సర్కారు, ఉపాధ్యాయులు ముందు నుంచి అవగాహన కల్పించి ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు పుట్టపర్తిలోని పాఠశాలలో జరిగిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(CHANDRABABU NAIDU), విద్యాశాఖ మంత్రి లోకేశ్ (LOKESH) పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. వారి మార్క్ లిస్టులను పరిశీలించారు. అంతేకాదు.. ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. పాఠ్య బుక్‌లోని రెండు పాఠాలను ఆయన చదివి విద్యార్థులకు వివరించారు. ఆయన తనయుడు, మంత్రి లోకేశ్ ఓ విద్యార్థిగా బల్లపై కూర్చుని పాఠాలు విన్నారు. విద్యార్థులతో చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు దిగారు. వాటిని మీకు పంపుతామని విద్యార్థులకు తెలిపారు. ఓ విద్యార్థిని ప్రోగ్రెస్ కార్డును పరిశీలించి, సైన్స్ లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థినితో నువ్ డాక్టర్ (DOCTOR) అయిపోతావ్ అని బాబు కితాబిచ్చారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి బాగా చదివించాలని సూచించారు.
…………………………………………….