* ప్రభుత్వంలో అన్నింటా తగిన ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబు
* గత సర్కారులో డిప్యూటీ సీఎంలు ఐదుగురు.. ఇప్పుడు కల్యాణ్ ఒక్కరే
* అంతేకాదు.. ఆయనకు నచ్చిన శాఖల కేటాయింపు
* గెలుపులో జనసేనాని పాత్రను మరువని బాబు
* అందరి చూపూ.. పవన్ వైపే..
* అంచనాలకు తగ్గట్టు మెప్పించేనా..?
* 19న పదవీ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అతనికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా అతనో తూఫాన్ అన్నారు. ఈపాటికే అర్థమై ఉంటుంది ఆయనెవరో. ఎస్.. అతడే ఒక సైన్యంగా., లక్షలాది మంది సేనకు జనసేనానిగా కొనసాగుతున్న కొణిదెల పవన్ కల్యాణ్.
ఆకేరు న్యూస్, విజయవాడ :ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడ్డ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో ఎవరికీ ఇవ్వని గుర్తింపును ఆయనకు అందిస్తుండడం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించడంలో పవన్ పాత్ర కీలకంగా ఉంది. దీంతో పవన్ కు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు పవన్‌కు గుర్తింపు లభిస్తోంది. మోదీ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లిన పవన్.. ఓ ప్రముఖ చానల్ తో మాట్లాడుతూ తనకు పర్యావరణం, గ్రామీణాభివృద్ధి వంటి వాటిపై ఆసక్తి అని తెలిపారు. ఆయన ఆసక్తి మేరకే కేబినెట్ కూర్పులో చంద్రబాబు.. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు.
గత సర్కారులో ఐదుగురు.. ఇప్పుడు పవర్ ఒక్కరే..
పవన్‌కు ఇష్టమైన శాఖలను కేటాయించడమే కాదు. ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా కేటాయించారు. వైసీపీ ప్రభుత్వ హయంలో ఉప ముఖ్యమంత్రులు ఐదుగురు ఉండేవారు. కానీ.. పవన్ తో పాటు వేరొకరికి కూడా ఆ పదవి కేటాయిస్తే ప్రాముఖ్యత ఉండదని భావించిన చంద్రబాబు.. కేవలం పవన్ కల్యాణ్ ను మాత్రమే ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా శుభాకాంక్షలు కూడా తెలిపారు. మీతో కలిసి పనిచేయడం తనకు గర్వంగా ఉందంటూ పవన్ కూడా బాబుకు రిప్లయ్ ఇచ్చారు.
పవన్‌కు మరో అరుదైన గౌరవం
కీలకమైన పదవులను ఇవ్వడమే కాదు.. పవన్‌కు మరో అరుదైన గౌరవాన్ని కూడా చంద్రబాబు కల్పించారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటో ఉండటం ఆనవాయితీ. ఇప్పుడు ముఖ్యమంత్రి తో పాటుగా ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ ఫొటో కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ, ప్రచార అంశాల్లోనూ ముఖ్యమంత్రి ఫొటో ఎక్కడైతే వినియోగించాల్సి వస్తుందో.. అక్కడ పవన్ ఫొటో కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. దీని ద్వారా పవన్ డిప్యూటీ సీఎంగా ఉంటున్నా..ఎక్కడా ప్రాధాన్యత తగ్గకూడదని భావిస్తున్నారు. కూటమి కట్టడంలోను, బ్రహ్మాండమైన విజయంలోనూ జనసేనాని పాత్రను మరువని బాబు.. ఆయనకు ప్రతిచోటా సముచిత స్థానం కల్పిస్తున్నారు.
ఇప్పుడు అందరి చూపూ పవన్ పైనే..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్.. ఈ నెల 19వ తేదీన పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను కూడా ఆయన ఆరోజే స్వీకరించనున్నట్లు జనసేన ట్విటర్ (ఎక్స్ ) ద్వారా వెల్లడించింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పదేళ్ల పాటు పార్టీ నడిపిన పవన్‌కు ఇటీవల ఎన్నికల్లో ప్రజలు అద్భుత విజయాన్ని అందించారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించారు. పవన్ కష్టాన్ని చూశారు. ఆయన మాటలను విశ్వసించారు. పవన్‌తో పాటు తెలుగుదేశం కూటమికి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారు. ఈక్రమంలో ప్రజల నమ్మకానికి అనుగుణంగా పవన్ నడుచుకుంటారా? దేశానికి కొత్త తరం రాజకీయాలను పరిచయం చేస్తానన్న ఆయన అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడిగా ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.
————————————–