
పశ్చిమ బెంగాల్లో ఢీకొన్న రెండు రైళ్లు
* ఢీకొన్న రెండు రైళ్లు
* ఆరుగురు దుర్మరణం
* 30 మందికిపైగా గాయాలు
* మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
* ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎలా వచ్చాయి?
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చి ఢీకొన్నాయి. ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. ప్రమాద తీవ్రతను, అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సంఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. ఇక బోగీలోని ప్రయాణికులు ఎగిరిపడ్డారు. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి.
పశ్చిమ బెంగాల్లో..
పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా న్యూ జల్పాయ్గురిలో ఈ ఘోర రైలు ప్రమాదం సోమవారం ఉదయం జరిగింది. ఆగి ఉన్న కాంచనగంగ ఎక్స్ ప్రెస్ ను వెనుక వచ్చిన గూడ్స్ రైలు ఢీకొన్నట్లు తెలస్తోంది. రంగపాణి – నిజ్జారి స్టేషన్ల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు డార్జిలింగ్ ఏఎస్పి అభిషేక్రాయ్ తెలిపారు. సుమారు 15మీ. ఎత్తులో బోగీ ఆగి ఉండడం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. రెస్క్యూ సిబ్బందితో పాటు స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. – ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎలా వచ్చాయి.. అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ప్రమాదంతో కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
ఘటనా స్థలికి బెంగాల్ సీఎం
రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు. సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ రైలు ప్రమాద ఘటన షాక్‌కు గురి చేసిందని పేర్కొన్నారు. డాక్టర్లు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు : అశ్వీనీ
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎన్ ఎఫ్ ఆర్ జోన్లోజరిగిన ఘోర ప్రమాదంలో ఎన్డీఆర్ ఎఫ్, ఎస్ డీఆర్ ఎఫ్ సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారని, ఉన్నతాధికారులు ఘటనాస్థలిలోనే ఉన్నారని పేర్కొన్నారు.
———————–