Chandrayan Movie Pre-Release event
* ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ – శ్రీ విష్ణు
* నవంబర్ 13న థియేటర్లలోకి
ఆకేరు న్యూస్, సినిమా: విభిన్నమైన కథలు, కొత్త కాన్సెప్ట్‌లతో తెరకెక్కే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని హీరో శ్రీ విష్ణు అన్నారు. అలాంటి కొత్త ప్రయత్నంతో వస్తున్న చిత్రమే ‘చంద్రయాన్’ (Chandrayan) అని చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హిలేరియస్ అడ్వెంచర్ మూవీ నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది.
‘రాజు వెడ్స్ రాంబాయి’ విజయానంతరం నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సింబా స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రవీణ్ మొలక నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
* కొత్త టీమ్‌ను ప్రోత్సహిస్తున్న వేణు ఊడుగుల – శ్రీ విష్ణు
ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. వేణు ఊడుగుల ఎప్పుడూ కొత్తదనం ఉన్న కథలనే ప్రోత్సహిస్తారని అన్నారు. ‘చంద్రయాన్’ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నప్పుడు అందులోని సరదా అంశం తనకు నచ్చిందని చెప్పారు. “కొత్త టీమ్‌ను సపోర్ట్ చేస్తున్న వేణు గారిని అభినందిస్తున్నా. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ కొత్త టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు కూడా ఈ ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను” అని శ్రీ విష్ణు అన్నారు.
* పదేళ్ల కల నెరవేరుతోంది – శివకుమార్ ధీకొండ
హీరో శివకుమార్ ధీకొండ మాట్లాడుతూ.. హీరోగా వేదికపై నిలబడాలన్నది తన పదేళ్ల కల అని భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, ఇలాంటి మంచి కథలో హీరోగా అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పారు. దర్శకుడు తనను హీరోగా ఎంపిక చేసుకున్నందుకు, నిర్మాత తనపై నమ్మకంతో సినిమా నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమా చేయడం అంత సులభం కాదని, టీమ్ మొత్తం ఎంతో సహకరించిందన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి థియేటర్లకు వచ్చి సినిమాను ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులను కోరారు.
* రెండు గంటల పాటు నవ్వించే సినిమా – దర్శకుడు శ్రీనాథ్
దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం 42 రోజుల పాటు షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నటుడు, టెక్నీషియన్ ఎంతో కష్టపడ్డారని చెప్పారు. శివకుమార్‌ను ఈ చిత్రంలో రాకెట్ మ్యాన్‌గా చూపించామని, భవిష్యత్తులో ఆయన రాకెట్ స్టార్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.
“ఈ నెల 13 నుంచి ప్రతి థియేటర్లో నవ్వుల సందడి మొదలవుతుంది. రెండు గంటల 15 నిమిషాల పాటు ప్రేక్షకులను ఆగకుండా నవ్వించే సినిమా ఇది. ఆయుధాలు, రక్తపాతం లేని చిత్రం. మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా థియేటర్‌కు వచ్చి రెండు గంటల పాటు వాటిని మర్చిపోయి నవ్వుకోవచ్చు. మా సినిమా మీకు లాఫింగ్ థెరపీలా ఉంటుంది” అని దర్శకుడు పేర్కొన్నారు.
* కొత్త తరహా కామెడీతో ఆకట్టుకుంటుంది – బాబా భాస్కర్
కొరియోగ్రాఫర్, నటుడు బాబా భాస్కర్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో తనకు ఒక కుటుంబం దొరికిన అనుభూతి కలిగిందన్నారు. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రేక్షకులను నవ్వించేందుకు టీమ్ నిజాయితీగా ప్రయత్నించిందని, ప్రధాన నటీనటుల ప్రదర్శనలు ఆకట్టుకుంటాయని తెలిపారు.
సంగీత దర్శకుడు హర్ష ప్రవీణ్ మాట్లాడుతూ.. సిచ్యుయేషనల్ కామెడీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, జానపదాల గురించి తెలుసుకుని పాటలను రూపొందించినట్లు తెలిపారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ ఎంతో సహకరించారని పేర్కొన్నారు.
* ‘చంద్రయాన్’కు అండగా నిలిచిన సినీ ప్రముఖులు
సమర్పకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ.. కొత్త ఆలోచనతో, వినూత్నంగా తెరకెక్కిన అరుదైన చిత్రమిదని అన్నారు. సినిమా చూసిన వెంటనే తనకు నచ్చిందని, అందుకే టీమ్‌కు మద్దతుగా నిలిచానని చెప్పారు. విడుదల విషయంలో బెక్కెం వేణుగోపాల్, శిరీష్ సహకారం అందించారని తెలిపారు. ప్రేక్షకులు కొత్త తరహా సినిమాలను ప్రోత్సహించాలని కోరారు.
నిర్మాత ప్రవీణ్ మొలక మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీనాథ్, నటీనటులు, సాంకేతిక బృందం సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. యూత్‌తో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి చూసి ఆనందించేలా ఈ చిత్రం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నటుడు రవి శివతేజ ఈ సినిమాలో తొలిసారి తెలంగాణ యాసలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. నటుడు బలగం సత్యనారాయణ మాట్లాడుతూ.. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరనే మంచి అంశాన్ని సినిమాలో చూపించారని చెప్పారు. దర్శకులు రవికాంత్, ఆదిత్య, మల్లిక్ రామ్, నీలకంఠతో పాటు కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి, నిర్మాతలు పూజారి నాగేశ్వరరావు, బెక్కెం వేణుగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ తదితరులు నటించిన ‘చంద్రయాన్’ నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది. కొత్త కాన్సెప్ట్, తెలంగాణ నేపథ్యం, హాస్యంతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

