Musi River Cleaning Project
* అన్ని అనుమతులు.. త్వరలో టెండర్లు
* తొలివిడతలో 21 కిలోమీటర్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులు లభించాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొత్తం 55 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మూసీ నదిలో తొలివిడతగా 21 కిలోమీటర్ల మేర పునరుజ్జీవన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. మూసీ ప్రక్షాళన అనేది కేవలం సుందరీకరణ కార్యక్రమం కాదని, ప్రజల జీవితాలతో ముడిపడిన అంశమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యాధునికంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని చెరువులకు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించి, వాటిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నగర అభివృద్ధికి ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

* భవిష్యత్తు తరాల కోసమే మూసీ ప్రక్షాళన
మూసీ నదిని ప్రక్షాళన చేయాలనే నిర్ణయం భవిష్యత్తు తరాలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో తీసుకున్నామని సీఎం తెలిపారు. తనకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని, ఎవరిపైనా కోపం లేదని, ప్రకృతిని కాపాడాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. కొంతమందికి ఈ నిర్ణయంతో ఇబ్బందులు ఎదురైనా, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తమ్మిడికుంట చెరువును పునరుద్ధరించాలని నిర్ణయించిన సమయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని, ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొందరి మనసులు నొచ్చుకుని ఉండవచ్చని సీఎం పేర్కొన్నారు. అయితే రాబోయే తరాలకు ఉపయోగపడేలా చెరువును అభివృద్ధి చేయడమే తమ ఉద్దేశమని తెలిపారు. గతంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తమ్మిడికుంటను సుమారు 30 ఎకరాలకు విస్తరించి సుందరంగా తీర్చిదిద్దినట్లు వివరించారు.
* హైదరాబాద్‌లో ఒకప్పుడు 1,372 చెరువులు
హైదరాబాద్ నగరానికి చెరువులు, రాతి నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణ అని ముఖ్యమంత్రి అన్నారు. గొలుసుకట్టు చెరువులు, సహజసిద్ధమైన రాక్ ఫార్మేషన్లతో హైదరాబాద్ ఒకప్పుడు ఎంతో సుందరంగా ఉండేదని గుర్తుచేశారు. నగరంలో గతంలో 1,372 చెరువులు ఉండేవని, వివిధ కారణాలతో వాటిలో దాదాపు 50 శాతం కనుమరుగయ్యాయని తెలిపారు. పట్టణాలకు వలసలు రావడం, జీవనాధారం కోసం కొందరు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, మరికొందరు చెరువులను ఆక్రమించడం, ప్రభుత్వాల నిర్లక్ష్యం వంటి కారణాలతో చెరువులు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. తమ్మిడికుంటతో పాటు బతుకమ్మకుంట, బుమ్-రుక్నుద్దౌలా, సున్నం చెరువు, నల్లచెరువు, ఫాక్స్ సాగర్, మియాపూర్ చెరువు సహా దాదాపు 20 చెరువులను పునరుద్ధరించి సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో 10 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు విస్తరించి ఉండాల్సిన చెరువులు ఆక్రమణలకు గురై కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

* చెరువుల ఆక్రమణలతోనే నగరంలో వరద సమస్యలు
వర్షాలు కురిసినప్పుడు హైదరాబాద్ రహదారులు జలమయమవడం, గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటానికి కారణాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సీఎం సూచించారు. నీళ్లు ఉండాల్సిన ప్రాంతాలను ఆక్రమించుకోవడం వల్ల, ఇప్పుడు మనం నివసించే ప్రాంతాల్లోకి నీళ్లు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీనివల్ల బస్తీల్లో నివసించే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. 1908లో హైదరాబాద్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా వేలాది మంది మరణించారని గుర్తుచేశారు. అప్పటి నిజాం నవాబు దీర్ఘకాలిక పరిష్కారం కోసం ఆలోచించి, ప్రఖ్యాత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను వినియోగించుకున్నారని చెప్పారు. ఆయన సూచనలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి 1920 నాటికి పూర్తి చేసినట్లు వివరించారు. వందేళ్ల క్రితం నిర్మించిన ఆ రిజర్వాయర్లు నేటికీ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయని పేర్కొన్నారు.
* మూసీ నది చుట్టూ చారిత్రక కట్టడాలు
నిజాం కాలంలోనే మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. మూసీ వెంట పురానాపూల్ బ్రిడ్జి, సిటీ కాలేజీ, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, బ్రిటిష్ రెసిడెన్సీ వంటి అనేక చారిత్రక కట్టడాలు నిర్మించారని తెలిపారు. ఒకప్పుడు మూసీ పరిసర ప్రాంతం వ్యాపారాలకు కేంద్రంగా విలసిల్లిందని చెప్పారు. అయితే ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపకపోవడంతో మూసీ నది పరిస్థితి క్రమంగా దిగజారిందని, చివరకు నది ఉనికికే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. మూసీలో మనుషుల మృతదేహాలు, పశువుల కళేబరాలు, ఇతర వ్యర్థాలు చేరి మురికికూపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మానవ తప్పిదాలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన పరిస్థితి అని వ్యాఖ్యానించారు.
* మూసీ కాలుష్యంతో నల్గొండ ప్రజలకు ఇబ్బందులు
మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం పేర్కొన్నారు. నల్గొండలో ఒకవైపు ఫ్లోరైడ్ సమస్య ఉండగా, మరోవైపు మూసీ కాలుష్యం ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తోందని తెలిపారు. తాను స్వయంగా ఆ ప్రాంతాలను సందర్శించి రైతులతో మాట్లాడినట్లు చెప్పారు. మూసీ కాలుష్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, రైతుల ఆవేదన తన దృష్టికి వచ్చాయని తెలిపారు. కాలుష్యం తమ ప్రాణాలతో చెలగాటమాడుతోందని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు.
* మూసీ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకరించాలి
దేశంలోని పలు ప్రాంతాల్లో నదీ పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. గుజరాత్లో సబర్మతీ రివర్ ఫ్రంట్, ఉత్తరప్రదేశ్‌లో గంగా, ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. ప్రపంచంలోని అనేక నాగరికతలు నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయని అన్నారు. దక్షిణ కొరియాలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి ద్వారా 24 గంటలపాటు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి చేరుకున్నారని ఉదాహరణగా పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు కూడా దోహదపడుతుందని వివరించారు. మూసీ ప్రక్షాళనలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎవరైనా బాధితులు ఉంటే నూటికి నూరు శాతం ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మూసీ అభివృద్ధి విషయంలో రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి నాయకులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
* తమ్మిడికుంట నిర్వహణకు మహిళా శక్తికి బాధ్యతలు
తమ్మిడికుంట చెరువును పునరుద్ధరించడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు భూగర్భ జలాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ చెరువు పునరుద్ధరణకు సహకరించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. అయితే చెరువును అభివృద్ధి చేసినంత మాత్రాన సరిపోదని, దాని నిర్వహణ కూడా అదే స్థాయిలో ఉండాలని సూచించారు. లేకపోతే తిరిగి పూర్వపు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్‌తో పాటు ఇందిరా మహిళా శక్తి సంఘాల మహిళలు చెరువు నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. చెరువు పరిసరాల్లో మహిళా శక్తి స్టాళ్లు ఏర్పాటు చేసి చిన్నచిన్న ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని, తద్వారా లేక్ ఎకానమీని అభివృద్ధి చేయాలని తెలిపారు. తమ్మిడికుంటను ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే కేంద్రంగా మాత్రమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే వేదికగా తీర్చిదిద్దాలని అన్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి స్థిరపడిన ప్రజలు తమ సంప్రదాయాలను కొనసాగించేందుకు ఈ ప్రాంతం ఉపయోగపడాలని, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు పరిసరాల్లో జమ్మి చెట్టును కూడా నాటాలని అధికారులకు సూచించారు.
* కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీనటుడు అక్కినేని నాగార్జున విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి, శాసనమండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

