ముమ్మరంగా ‘ఆపరేషన్ కగార్-2’
ఆకేరు న్యూస్, డేస్క్: ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు అగ్రనేతలు మరణించినట్లు సమాచారం. మృతుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తుండటంతో ఈ ఘటన సంచలనంగా మారింది. మావోయిస్టుల అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా ‘ఆపరేషన్-2 కగార్’ ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా సుమారు 5,000 మంది సీఆర్పీఎఫ్ (CRPF) మరియు ప్రత్యేక బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టుల కంచుకోటలను ధ్వంసం చేయడం, అగ్ర నేతలను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆపరేషన్ కగార్ గడువు ముగియడానికి కేవలం 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే బలగాలు తమ దాడులను తీవ్రతరం చేశాయి. డెడ్లైన్ లోపు కీలక ఫలితాలు సాధించాలనే పట్టుదలతో అటవీ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. కర్రెగుట్ట పరిసరాల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఘటన స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, తుపాకులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దు జిల్లాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల వివరాలను అధికారికంగా గుర్తించాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
