Chicken Price Hike India
* రికార్డు స్థాయికి చికెన్ ధర
* కేజీ రూ.360
ఆకేరు న్యూస్, డెస్క్: ఇటీవల కాలంలో నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్ ధరలు మరింత షాక్ ఇస్తున్నాయి. మార్కెట్లో చికెన్ ధరలు విపరీతంగా పెరగడంతో.. ఆదివారం వచ్చిందంటే చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగని సామాన్యుడు ఇప్పుడు చికెన్ షాపుల వైపు వెళ్లడానికే భయపడుతున్నాడు.
* వారం రోజుల్లోనే భారీ మార్పు…
గడిచిన వారం రోజులుగా చికెన్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్లెస్ (Skinless Chicken) చికెన్ ధర ఏకంగా రూ.360 మార్కుకు చేరింది. కేవలం పది రోజుల క్రితం దీని ధర రూ.240 మాత్రమే ఉండటం గమనార్హం. అంటే పది రోజుల వ్యవధిలోనే కిలోపై ఏకంగా రూ.120 వరకు భారం పడింది.
* లైవ్ కోడి ధరలూ పైపైకే..
స్కిన్లెస్ మాత్రమే కాకుండా మిగిలిన రకాల ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ప్రస్తుతం విత్ స్కిన్ (With Skin) చికెన్ ధర కిలో రూ.300 వరకు పలుకుతోంది.
బ్రాయిలర్ లైవ్ కోడి (Live Bird) ధర కిలో రూ.200 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నారు.
* ధరల పెరుగుదలకు కారణాలు..
ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగడం, దాణా ఖర్చులు ఎక్కువవ్వడంతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సప్లై తగ్గడం, డిమాండ్ అలాగే ఉండటంతో ధరలు ఈ స్థాయిలో పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో చికెన్ కొనడం మరింత భారంగా మారేలా కనిపిస్తోంది.
