Kamareddy Gurukul Hostel Food Poisoning
ఆకేరు న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల హాస్టల్లో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
నిన్న మధ్యాహ్నం హాస్టల్లో ఏర్పాటు చేసిన భోజనం తిన్న తర్వాత విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. దాదాపు 12 మంది విద్యార్థుల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో గురుకుల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
* ఆందోళనలో తల్లిదండ్రులు..
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. హాస్టల్కు, ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. హాస్టల్లో పరిశుభ్రత పాటించకపోవడం వల్లే తమ పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని, నాణ్యమైన ఆహారం అందించడంలో అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన 12 మంది విద్యార్థులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. లక్కీగా అందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్య వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
