* ఓటు వేసి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఘటన
* మద్యం మత్తే ముప్పు తెచ్చిందంటున్న ప్రయాణికులు
ఆకేరు న్యూస్, చిలకలూరిపేట : పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓటు వేసి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం దగ్గర ఓ లారీ – ప్రైవేటు బస్సు ఢీకొని భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు మొత్తం ఆరుగురు సజీవ దహనమయ్యారు. సుమారు 20 మందికిపైగా గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఓటు వేయడానికి సొంతూర్లకు వచ్చి.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. మద్యంమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి 41 మంది ప్రయాణికులతో అరవింద ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వారే. మంగళవారం అర్ధరాత్రి సమయంలో చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగి.. ఆపై వేగంగా బస్సుకు మంటలు వ్యాపించాయి. దీంతో రెండు వాహనాల్లోని డ్రైవర్లతో పాటు మరో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో బస్సు డ్రైవర్ అంజితో పాటు ఉప్పుగుండూరు కాశీయ్య, ఉప్పుగుండూరు లక్ష్మీ, ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీగా గుర్తించారు. ఇంకా పలువురిని గుర్తించాల్సి ఉంది.
కళ్లు తెరిచేలోపే..అగ్నికీలలకు బస్సు ఆహూతయిందని ప్రయాణికులు వాపోతున్నారు. గాఢ నిద్రలో ఉన్నవాళ్లు..నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై.. 108తో పాటు పోలీసులకు సమాచారం చేరవేశారు.
———————-