* ఉలిక్కిపడ్డ బీజాపూర్
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : ఎన్కౌంటర్లో మావోయిస్టులను ఏరివేస్తున్న నేపథ్యంలో.. మావోయిస్టులు ప్రతిదాడులకు ప్రణాళికలు రచించారు. జవాన్ల లక్ష్యంగా మందుపాతరలు అమర్చారు. అది పేలి దురదృష్టవశాత్తూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సైనికులే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర అమర్చారు. బీజాపూర్ బొడ్గా గ్రామానికి చెందిన చిన్నారులు ఓయం (13), బోటి ఓఎం (11) ఆడుకుంటూ.. పొరపాటున అక్కడ ఉన్న ఐఈడీ బాంబులను తాకారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పేలుడు శబ్దానికి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని వెళ్లి చూడగా ఇద్దరు చిన్నారులు విగతజీవులై కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను తీసుకొని గ్రామస్థులందరూ మూకుమ్మడిగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. మావోయిస్టుల దాడిగా బీజాపుర్ ఎస్పీ ధ్రువీకరించారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు కొద్ది రోజుల కిందట పొలాల్లో ఐఈడీ బాంబులను అమర్చినట్లు వెల్లడించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి పునరావృతం కాకుండా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తామని బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ పేర్కొన్నారు.
——————————