* సినీ అభిమానులకు బ్యాడ్ న్యూస్
* ఆక్యుపెన్సీ లేకే అంటున్న యజమానులు
* సినిమాలపై ఎన్నికల ఎఫెక్ట్
* వేసవిలో కొత్త సినిమాల విడుదల అంతంతే..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : థియేటర్ల యజమానులు సినిమా కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొత్త సినిమాలు విడుదలవ్వక.., చిన్న సినిమాలు చూసేందుకు జనాలు థియేటర్లకు రాక.. నష్టాలను చవిచూస్తున్నారు. ఈక్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొన్ని సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను కొద్ది రోజులు మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు థియేటర్స్ యాజమాన్యం ప్రకటించింది.
* ఎన్నికలతో సినిమాల విడుదలకు బ్రేక్
వేసవి వస్తోందంటే.. సాధారణంగా కొత్త సినిమాల విడుదల వెల్లువలా ఉంటుంది. విద్యాలయాలకు సెలవుల నేపథ్యంలో కేవలం వేసవికాలంలో రిలీజ్ చేయడానికి డేట్స్ కూడా ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. కానీ ఈ ఏడాది ఎందుకో వేసవిలో కొత్త సినిమాలు ఏవీ కూడా రిలీజ్ కాలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఉండటంతో.. కొత్త సినిమాల విడుదలను నిర్మాతలు వాయిదా వేసుకున్నారు. అంతేకాకుండా ఈ సారి సమ్మర్ టార్గెట్ గా పెద్ద సినిమాలతో పాటు చిన్నా చితక చిత్రాలు కూడా ఏవీ సిద్ధం అవలేదు. దీంతో సింగిల్ ధియేటర్లలో సినిమాలు పడే అవకాశం లేదు.ఇప్పటికే కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ థియేటర్లను నడిస్తున్నారు వాటి యజమానులు.
*మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావట్లే..
చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించకపోవడంతో..థియేటర్ కరెంట్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో భారీగా నష్టపోతున్నారు. దీనికి తోడు మే నెలాఖరు వరకు కూడా కొత్త సినిమాలు విడుదల లేకపోవటంతో.. ధియేటర్లను 10 రోజులకు పైగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిజానికి మల్టీప్లెక్స్‌లు వచ్చాక చిన్న థియేటర్లకు వచ్చేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దీనికి తోడు షాపింగ్స్ చేసో.. ఫ్యామిలీతో బయటకు వెళ్లో అలా థియేటర్‌కు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువే. మల్టీఫ్లెక్స్‌లలో తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, హాలీవుడ్ సినిమాలు కూడా వేయడంతో వారికి బాగానే లాభాలు వస్తున్నాయి కాబట్టి వాటిని ఒక్క రోజు కూడా క్లోజ్ చేయకుండా రన్ చేస్తున్నారు.
*తప్పనిసరి పరిస్థితుల్లో థియేటర్లు మూసివేస్తున్నాం.
అజయ్ కుమార్, థియేటర్ యజమాని, వరంగల్ .
పెద్ద సినిమాలు రావడం లేదు.. ఖర్చులు కూడా రావడం లేదు. తప్పని సరి పరిస్థితుల్లోనే థియేటర్లు మూసి వేయాల్సి వచ్చింది. ముప్పయి ఏళ్ళుగా సినిమా థియేటర్లు నడుపుతున్నాం. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. కనీసం పది రోజులు బంద్ చేయడం వల్లనైనా పెద్ద సినిమాలు వస్తాయని ఆశపడుతున్నాం.
——————–