* విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం…
* ప్రీ స్కూల్స్‌గా అంగన్వాడీలు, నాలుగు నుంచి 12వ తరగతి వరకు సెమీరెసిడెన్షియల్, రెసిడెన్షియల్ స్కూళ్లకు యోచన
* మార్పులకు విధాన పత్రం రూపొందించండి..
* యూనివర్సిటీ వీసీలు, బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తాం…
* విద్యావేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు. అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్య బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై చర్చించేందుకు విద్యావేత్తలతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా 11 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం, టెట్ (TET) నిర్వహణ, ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించడం, పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫాంలు, పాఠ్య పుస్తకాల అందజేత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేపట్టిన విధానాన్ని ముఖ్యమంత్రి తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, విద్యావేత్తలు ఇచ్చే మంచి సూచనలు స్వీకరిస్తామని తెలియజేశారు. భేటీలో పాల్గొన్న ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, పి.ఎల్.విశ్వేశ్వరరావు, శాంతా సిన్హా, ఆల్దాస్ జానయ్య, పద్మజా షా, లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి (Akunuri Murali) విద్యా వ్యవస్థ బలోపేతానికి పలు సూచనలు చేయడంతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. అంగన్వాడీల్లో కార్యకర్తలకు బోధించే నైపుణ్యం ఉండడం లేదని, సరైన వసతులు లేవని ప్రొఫెసర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని ప్రీ స్కూల్స్‌గా మార్చి వాలంటీర్లను తీసుకొని వారికి శిక్షణ ఇచ్చి పూర్వ ప్రాథమిక విద్యకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా తీర్చిదిద్దాలనే యోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
మూడో తరగతి వరకు ప్రీస్కూల్లో బోధన అందేలా చూసి, నాలుగు నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆయా స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం యోచన తమకు ఉందన్నారు. పదేళ్లుగా యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది నియామకం జరగలేదని, వీసీలు లేరని ప్రొఫెసర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీసీల నియామకానికి ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేశామని, త్వరలోనే వీసీల నియామకం పూర్తవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్స్ ఇవ్వాలని, ప్రతి యూనివర్సిటీలో వివిధ అంశాలపై లోతైన చర్చ, వాస్తవాల వెల్లడికి అభివృద్ధి చరిత్రకు సంబంధించిన అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. విద్యా సూచికలో తెలంగాణ అట్టడుగున ఉందని, తామంతా ఉస్మానియా విశ్వ విద్యాలయంలోనే (Osmania University) చదువుకున్నామని, ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చామని, ప్రస్తుతం ఓయూలోనూ విద్యా ప్రమాణాలు పడిపోయాయని ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ శాంతా సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా వ్యవస్థ బలోపేతానికి తాము ఇప్పటికే మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్లతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యా వ్యవస్థలో తీసుకురావల్సిన మార్పులపై విధాన పత్రం రూపొందిస్తే.. దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. ఆయా అంశాలపై క్యాబినెట్ సబ్ కమిటీతోనూ చర్చించాలని వారికి సూచించారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు అతి తక్కువ వడ్డీకి, దీర్ఘకాల రుణాలు ఇస్తాయని, ఇప్పటికే పలు రాష్ట్రాలు వాటి సాధనకు ప్రయత్నిస్తున్నాయని ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఆ అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 11 శాతంగా ఉన్న విద్యా శాఖ బడ్జెట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 6.4 శాతానికి పడిపోయిందని, విద్యా వ్యవస్థ బలోపేతానికి బడ్జెట్ పెంపు అవసరమని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. తాను, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నామని, కచ్చితంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి బడ్జెట్ పెంచుతామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, బడ్జెట్ కేటాయింపులు తప్పకుండా పెంచుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. భేటీలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.
———————————————————