Telangana Panchayat Salary Orders
*పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. రాష్ట్రంలోని దాదాపు 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు నెలనెలా సమయానికి జీతాలు అందినట్లే.. క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా అదే విధంగా వేతనాలు అందాలని సీఎం స్పష్టం చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ పరమైన పురోగతిని పరిశీలిస్తూ అధికారులకు పలు కీలక సూచనలు మరియు ఆదేశాలు జారీ చేశారు.
*జీతాల కోసం రూ. 50 కోట్ల ప్రత్యేక నిధులు..
గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాల చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం జరగకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున ప్రతినెలా రూ. 50 కోట్లను ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు అందేలా చూడాలని.. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా సహించేది లేదని అధికారులను గట్టిగా హెచ్చరించారు.
*పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణకు ఆదేశం…
గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామ పంచాయతీలు తమ స్వంత ఆదాయంపై నియంత్రణ కోల్పోయాయని సీఎం అభిప్రాయపడ్డారు. పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 70 (3) ప్రతిపాదిత సవరణ ప్రకారం.. గ్రామ పంచాయతీ స్వంత ఆదాయాన్ని (Own Source Revenue) ట్రెజరీ ఖాతాలో కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని అధికారులను ఆదేశించారు.
*పోస్టల్ విధానం రద్దు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే పెన్షన్లు
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ విధానంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ విధానాన్ని మార్చాలని, ఇకపై నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పెన్షన్ డబ్బులను జమ చేయాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా, పెన్షన్లు కేవలం అర్హులకు మాత్రమే అందేలా కఠిన నిబంధనలు పాటించాలన్నారు. ముఖ్యంగా ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, మరియు SEEEPC సర్వే డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధీకరించాలని సూచించారు. కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
*సమీక్షలో పాల్గొన్న ప్రముఖులు..
ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ కీలక సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఎంపీ వేం నరేందర్ రెడ్డి మరియు పంచాయతీరాజ్ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
