Palamuru Rangareddy Project Review
*పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్
*సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రతిష్టాత్మక ‘పాలమూరు – రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేవలం పాలమూరు-రంగారెడ్డి మాత్రమే కాకుండా, ఉమ్మడి జిల్లాలోని ఇతర పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ (MCRHRD) సంస్థలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ఎదురవుతున్న అడ్డంకులు, నిధుల లభ్యతపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో ప్రాజెక్టులను వేగంగా పరుగులు పెట్టించేందుకు సీఎం పలు కీలక సూచనలు చేశారు.
నిధుల జాప్యానికి తావులేదు..
*బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం సిద్ధం…
భూసేకరణ ప్రక్రియలో నిధుల కొరత లేదా ఆలస్యం వల్ల ప్రాజెక్టులు నిలిచిపోకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాధితులకు మరియు భూములు ఇచ్చిన రైతులకు నిధుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. “ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. నిధుల విడుదలలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఆర్థిక శాఖ తగిన చర్యలు తీసుకుంటుంది.” అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
*మంత్రులు, అధికారుల నిరంతర పర్యవేక్షణ…
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత స్థానిక మంత్రులదేనని సీఎం పేర్కొన్నారు. జిల్లా మంత్రులు సంబంధిత ప్రాజెక్టుల విభాగాల అధికారులు, జిల్లా కలెక్టర్లతో నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పరిశీలించాలని ఆదేశించారు.
*పాల్గొన్న ప్రముఖులు…
ఈ కీలక సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, టి. మేఘా రెడ్డి, కె. రాజేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రాజెక్టుల వారీగా తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పరిపాలనా పరమైన నిర్ణయాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ సమావేశంలో పాల్గొని, సీఎం ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సమీక్షతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పనులకు మరింత వేగం పుంజుకోనుంది.
