CM Revanth Reddy El Nino Review
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
వర్షాకాలం, వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో నీటి పారుదల, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, విద్యుత్ వంటి కీలక రంగాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
* నీటి వాటాలు – అంతరాష్ట్ర చర్చలు…
తెలంగాణ వాటా జలాలు: కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా జలాలు దక్కేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలు డ్యామ్‌లు నిండిన తర్వాతే నీళ్లు వదిలే విధానాన్ని పాటిస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయని అప్రమత్తం చేశారు.
ప్రొరేటా ప్రకారం నీరు.. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున, అంతరాష్ట్ర జలాల్లో ప్రొరేటా ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటాలపై ఆయా రాష్ట్రాల అధికారులతో ముందుగానే చర్చించి కార్యాచరణ రూపొందించాలన్నారు.
విద్యుత్ – నీటి మార్పిడి… మహారాష్ట్రలోని ‘కోయనా డ్యామ్’ నీటిని వంద శాతం జల విద్యుదుత్పత్తికే ఆ రాష్ట్రం వినియోగిస్తోందని, ఆ నీటిని మనం తీసుకొని వారికి అవసరమైన విద్యుత్‌ను మనం సరఫరా చేసే అంశంపై చర్చించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును ఆదేశించారు.
* వరద జలాల మళ్లింపు…
గోదావరి, ప్రాణహిత నదుల నుంచి వచ్చే వరద నీరు సముద్రంలో వృధా కాకుండా, స్వల్ప కాలంలో వచ్చే వరదను ఎలా మళ్లించాలనే దానిపై స్పష్టమైన విధానం రూపొందించాలని సూచించారు.
* డ్యామ్‌ల మరమ్మతులు – కఠిన చర్యలు..
రూ. 300 కోట్ల విడుదల: రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం ఆర్థిక శాఖ ఇప్పటికే రూ. 300 కోట్లు విడుదల చేసిందని అధికారులు తెలిపారు.
* అధికారులపై హెచ్చరిక..
గతంలో కడెం ప్రాజెక్టులో తలెత్తిన ఇబ్బందులను గుర్తు చేస్తూ, ఈ వర్షాకాలంలో ఎక్కడైనా డ్యామ్‌ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు.
వ్యవసాయ రంగం – ఏఐ (AI) టెక్నాలజీతో అవగాహన
* పంటల వైవిధ్యత…
వాతావరణ అంచనాలకు అనుగుణంగా తక్కువ నీరు వినియోగించుకునే పంటల సాగు, పంటల మార్పిడిపై రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఇందుకోసం ఏఐ (AI) టెక్నాలజీతో రూపొందించిన వీడియోలను, టీవీ ఛానెళ్ల ప్రసారాలను ఉపయోగించుకోవాలన్నారు.
* యూరియా సరఫరా..
రామగుండం ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా అంతా తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని సీఎం తెలిపారు.
* విపత్తు నిర్వహణ – పరిహారం పంపిణీ…
రూ. 1000 కోట్ల నిధులు: వరదల సమయంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, కూలిన వంతెనల నిర్మాణానికి విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ. 1000 కోట్లను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని చెప్పారు.
* తక్షణ స్పందన..
వడగాడ్పులు, వరదల సమయంలో ప్రాణ, ఆస్తి, పశు నష్టం వాటిల్లితే వెంటనే ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేసి, బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం అందేలా చూడాలన్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలుపై నివేదిక సమర్పించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
* తాగునీరు, విద్యుత్ మరియు పట్టణాభివృద్ధి..
రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు: క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో నీరు నిలిచే 141 ప్రదేశాలను గుర్తించి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని, పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీనియర్ అధికారి జయేష్ రంజన్ ని ఆదేశించారు.
తాగునీటి ఇబ్బందులు లేకుండా.. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
* విద్యుత్ శాఖ అప్రమత్తత…
గాలి, వానల వల్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నా, లైన్లు తెగినా తక్షణమే మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించడానికి అవసరమైన సామగ్రిని ముందే సమీకరించుకోవాలని సూచించారు.
* ముఖ్యమంత్రి పిలుపు..
జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు నిరంతరం సమన్వయంతో సమావేశాలు నిర్వహించాలి. రెవెన్యూ, పోలీస్, వైద్య, విద్యుత్, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
