CM REVANTH REDDY Telangana Heatwave Alert
* తెలంగాణకు వడగాల్పుల ముప్పు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. వాతావరణ శాఖ (IMD) తీవ్రమైన వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా, ఎండల తీవ్రతను తట్టుకునేందుకు తక్షణమే రంగంలోకి దిగాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉన్నందున, ఆయా జిల్లాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
* వైద్యారోగ్య శాఖ అలర్ట్…
వడదెబ్బ బారిన పడే బాధితులకు తక్షణ వైద్య సాయం అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది 24/7 అందుబాటులో ఉండాలి.
వడదెబ్బ లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చేవారికి వెనువెంటనే అత్యవసర చికిత్స అందించాలి. అన్ని ప్రభుత్వ దవాఖానలు, సబ్సెంటర్లలో తగినన్ని ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను, అవసరమైన అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి.
* తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ….
ఎండలు ముదురుతున్న వేళ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని, ఎండల వల్ల డిమాండ్ పెరిగినా తట్టుకునేలా గ్రిడ్లను సన్నద్ధం చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. అలాగే, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో బాటసారుల దాహం తీర్చేందుకు వీలుగా ప్రధాన కూడళ్లలో తక్షణమే చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
* సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు….
జిల్లాల్లో మారుతున్న పరిస్థితులను, ఎండల తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శ్రీ శాంతి కుమారి గారిని* ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై నివేదికలు తెప్పించుకోవాలని, అవసరమైన చోట తక్షణ దిశానిర్దేశం చేయాలని స్పష్టం చేశారు.
* ప్రజలకు సీఎం విజ్ఞప్తి…
వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలంతా స్వయం నియంత్రణ పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు బయటకు రాకూడదని.. సాధ్యమైనంత వరకు మధ్యాహ్న ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణాల్లో ఉన్నవారు ఎల్లప్పుడూ తాగునీటిని వెంట ఉంచుకోవాలని సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
