* లేఖ ద్వారా కోరిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
* ఎన్ఎంసీ 50 అడ్మిషన్లతో కూడిన అనుమతులు ఇవ్వడం శుభపరిణామం
* తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు విద్యార్థుల భవిష్యత్ కోసం మంజూరు చేయించా
* నర్సంపేట అభివృద్ధికి కావాల్సిన డిమాండ్ లు నెరవేరుతాయని ఆశాభావం
* ఆస్పత్రి కోసం భూమిని అందజేసిన వారిని ఆహ్వానించాలి
* సహకరించిన రైతు కుటుంబాలకు, స్థానికులకు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నపం
ఆకేరున్యూస్, నర్సంపేట: స్వరాష్ట్ర స్వప్నం సాకారం, తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిరంతరమైంది. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా, విద్యార్థుల భవిష్యత్ ను బంగారు మయంగా తీర్చిదిద్దే క్రమంలో వారి నాయకత్వంలో శాసననసభ్యుడిగా ఉన్న సమయంలో వారితో తనకు ఉద్యమకాలం నుంచి ఉన్న అనుబంధంతో నర్సంపేటకు మెడికల్ కళాశాలను మంజూరు చేయించానని చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాకు కేటాయించిన మెడికల్ కళాశాలను నర్సంపేట పట్టణంలో నిర్మించి అనుమతులను ఇచ్చారన్నారు. జిల్లా దవాఖానా పూర్తి చేశామని, ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్( NMC) ఈ సంవత్సరమే 50 అడ్మిషన్లతో కూడిన అనుమతులు ఇవ్వడం శుభపరిణామం అని అన్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు విద్యాపరంగా అత్యంత గౌరవాన్ని తెచ్చిపెట్టిందని తెలిపారు.
నర్సంపేటలో అన్ని రకాల రెసిడెన్సియల్ విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. MBA, MCA, ఇంజినీరింగ్ కళాశాలలు అనేక BED,MED విద్యాసంస్థలు, స్కిల్ సెంటర్స్ ఉన్నాయని తెలిపారు. నర్సంపేటలో అత్యున్నత ప్రమాణాలతో గుర్తుంపుపొందిన డిగ్రీ కళాశాల ఉందని చెప్పారు. ఈ నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్ గా విరాజిల్లాలంటే మెడికల్ విద్య సైతం అందుబాటులోకి వస్తే 100% అన్ని రకాల ఎడ్యుకేషనల్ సంస్థలు ఉన్నట్టు అవుతుందనే ప్రత్యేక విజ్ఞప్తితో మెడికల్ కళాశాల మంజూరు చేయించామన్నారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఆస్పత్రి నిర్మాణం, 50 అడ్మిషన్లతో, అన్నీ వసతులతో కూడిన మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు.
మెడికల్ కళాశాలకు సంబంధించి భవిష్యత్ లో 150 అడ్మిషన్లకు పెంపు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. PG కళాశాల కూడా రావాల్సి ఉంటుందని, మెడికల్ కళాశాల ప్రణాళికలో భాగంగా నర్సింగ్ కళాశాలకూడా మంజూరు చేశారన్నారు. నర్సింగ్ కళాశాలకు శాశ్వత బిల్డింగ్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సహాయ సిబ్బంది సంబంధించిన రెసిడెన్సియల్ భవనాలు, జరగబోయేటువంటి సీట్ల పెంపు కోసం రెసిడెన్సియల్ హాస్టల్స్, ల్యాబ్స్ తో పాటు ఇతర వసతుల కోసం కేసీఆర్ ప్రభుత్వంలో GO -83 ద్వారా మరో 183 కోట్లు మంజూరు చేశారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో మీరు నర్సంపేటకు వచ్చి మీ చేతుల మీదుగా మెడికల్ కళాశాల ప్రారంభించడం వల్ల నర్సంపేట అభివృద్ధికి కావాల్సిన డిమాండ్ లు నెరవేరుతాయనే ఆశాభావం ప్రజలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మరో 183కోట్ల నిధులు తెచ్చానని, నిర్మాణంలో ఉన్న పనులు కాకుండా కొత్త పనులకు టెండర్లు పిలవాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) నిధులతో ముందుకు వెలుతున్నాం కాబట్టి 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుడటం, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి మీరు టెండర్లు ఇప్పటికే పిలవాల్సిన అవసరం ఉండేదన్నారు. ఇప్పటికే 9 నెలల సమయం వృథా అయిందన్నారు. దాదాపు కొన్ని అంతస్తుల నిర్మాణం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. దానికి సంబంధించిన భూమి కూడా గతంలోనే అప్పగించడం జరిగిందన్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట నియోజకవర్గానికి ప్రత్యేకంగా 57 రకాల ఉచిత పరీక్షల కేంద్రం (తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ) కూడా ఏర్పాటు చేశామన్నారు. అది పేద ప్రజలకు సేవలందిస్తూ ఉందన్నారు.
నర్సంపేటలో జిల్లా ఆసుపత్రి రావటంతో ఇంతకుముందు ఉన్న సివిల్ ఆసుపత్రి ని ఎత్తివేస్తం అనే అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్టు తెలిసిందన్నారు. సివిల్ ఆస్పత్రిని ప్రజల సౌకర్యార్థం నర్సంపేట నియోజకవర్గానికి చాలా దూరంలో ఉన్న గిరిజన ప్రాంతమైన నెక్కొండ పట్టణానికి తరలిస్తామని నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్ రావు ప్రకటన చేశారని గుర్తు చేశారు. అలా చేయటం ద్వారా గిరిజన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించిన వారమవుతాము అని పేర్కొన్నారు. దీనితో పాటు దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేయాలని కోరుతున్నామన్నారు. నియోజకవర్గంలో 53పల్లె దవాఖానలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేశారని చెప్పారు. 29 దవాఖానలు పూర్తి చేసి సేవలందిస్తున్నాయని చెప్పారు. మిగతావి కూడా పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. వాటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా ప్రభుత్వం త్వరితగతిన చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. వీటితో పాటు నర్సంపేట పట్టణానికి కూడా మూడు బస్తీ దవాఖానలు మంజూరు చేయటం జరిగిందన్నారు. రెండు పూర్తి చేశాం, మిగతాది పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మెడికల్ కళాశాల సహాయ సిబ్బంది నియామక విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయని పలు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై విచారణ జరిగేలా జిల్లా కలెక్టర్ కు తగు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనప్పటికి నర్సంపేట జిల్లా కేంద్రం కాకున్నప్పటికీ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలో 8 అతిపెద్ద మంచినీటి సరస్సులో ఒకటైన పాకాల సరస్సు, అభయారణ్యం దగ్గరలో చరిత్ర కలిగిన ప్రదేశంలో ఈ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఇది రాష్ట్రంలోనే ప్రథమం అని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అడ్మిషన్ పొందుటకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు ఇది శుభ సూచకమని వివరించారు. ఇంత మంచి వాతావరణంలో మెడికల్ కళాశాలను మరింత గొప్పగా తీర్చిదిద్దడంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పాత్ర ఉండాలని, దానికి సంబంధించి మరియు నియోజకవర్గంలో మిగతా అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తారని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారన్నారు. నాడు గొప్ప సంకల్పం, ఆశయం కోసం నర్సంపేటకు మెడికల్ కళాశాల ఇవ్వటం జరిగిందని తెలిపారు. మెడికల్ కళాశాల నిర్మించే క్రమంలో స్థలం విషయంలో సెంటు భూమి కూడా ప్రభుత్వ స్థలాలు లేకుండా సమైక్య పాలకులు నియోజకవర్గాన్ని తయారు చేశారని చెప్పారు. ఇది విమర్శలకు పోయే సందర్బం కాదు, రాజకీయాలు చేసే సందర్బం కాదు. నర్సంపేట వాస్తవ్యులు, ప్రముఖ పారిశ్రామిక వెత్త దొడ్డా మోహన్ రావు ఆసుపత్రి నిర్మాణం కోసం పెద్ద మనసుతో ముందుకు వచ్చి భూమిని అందించి విశేషమైన కృషి చేశారని గుర్తు చేశారు. వారిని కూడా మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి ఆహ్వానించి సరైన గౌరవాన్ని ఇవ్వాలని కోరుతున్నామన్నారు. భూములు ఇచ్చేందుకు సహకరించిన రైతు కుటుంబాలకు, స్థానికులకు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీరు నర్సంపేటకు రావటం ద్వారా వీటికి పరిష్కారం దొరుకుతుందని ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. మెడికల్ కళాశాల అంటే ఒక జాతీయ స్థాయి విద్యాసంస్థ దీని ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రావటం గౌరవప్రదంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
——————————–