* పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న సంస్థలు
* తాజాగా మరో రెండు కంపెనీలతో ఒప్పందం
* ముగిసిన పర్యటన.. ఇప్పుడు దక్షిణ కొరియాకు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా నుంచి రేవంత్ బృందం దక్షిణకొరియా పర్యటనకు వెళ్లింది. కాగా అమెరికా పర్యటనకు వెళ్లిన నాటి నుంచీ పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు… అమెజాన్ వెబ్ సర్వీసెస్ సిద్ధమైంది. హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ వృద్ధి వ్యూహంలో అంతర్భాగమని కెర్రీ సర్సన్ అన్నారు. దీంతో త్వరలోనే హైదరాబాద్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ జరగనుంది. అలాగే.. హైదరాబాద్లో తమ సంస్థ విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్లోని తమ పరిశోధన-అభివృద్ధి సంస్థను విస్తరించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సంస్థ ప్రతినిధులు చర్చించారు. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధుల బృందాన్ని మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ప్రతినిధులు కలిశారు. అనంతరం తమ సంస్థను హైదరాబాద్లో ఆర్ అండ్ డీ సంస్థకు అనుబంధంగా స్వయంప్రతిపత్తి ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైటెక్, పర్యావరణ అనుకూల కంపెనీలను ఆకర్షించడంపై తాము దృష్టిసారించామని, మోనార్క్ ట్రాక్టర్స్ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్వయంప్రతిపత్తి , ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపామని, ఆ విజన్లో మోనార్క్ ట్రాక్టర్స్ బాగమై రాష్ట్రంలో తమ ఉనికిని విస్తరించుకోవాలని తాము ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి అన్నారు.
———————