Revanth Paddy Procurement Review
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను మిషన్ మోడ్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, కొనుగోళ్లలో ఏ చిన్న సమస్య వచ్చినా ఆయా జిల్లాల కలెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కొనుగోళ్ల పురోగతిపై సమీక్షించారు.
* ముఖ్యమంత్రి జారీ చేసిన కీలక ఆదేశాలు ఇవే…
కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు స్వయంగా సందర్శించాలి. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలి. లోడింగ్ పూర్తయిన వెంటనే రైతులకు రశీదులు అందించాలి. ధాన్యం రవాణాలో జాప్యం చేసే లారీ కాంట్రాక్టర్లను ఉపేక్షించవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. లారీల కొరత ఉంటే ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్లను వాడాలని రవాణా శాఖకు సూచించారు.
తాత్కాలిక నిల్వ కేంద్రాలు: గోదాముల కొరత ఉన్న చోట రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను వినియోగించుకోవాలి. ధాన్యం నిల్వ కోసం తాత్కాలిక ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
అకాల వర్షాల నుంచి రక్షణ: వర్షాల వల్ల ధాన్యం తడవకుండా రైతులకు సరిపడా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. వాతావరణ సమాచారాన్ని రైతులకు చేరవేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాలి.
అధికారుల నియామకం: ప్రతి ఐకేపీ (IKP) సెంటర్ వద్ద ఒక అధికారిని, ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షణను ముమ్మరం చేయాలి.
* అధికారులపై కొరడా…
ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించే అధికారులు ఎంతటి వారైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రతి అధికారి జవాబుదారితనంతో పనిచేసి రైతులకు అండగా నిలవాలని కోరారు.
ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
