* తెలంగాణను వణికిస్తోన్న చలి
* ఏజెన్సీలో సింగిల్ డిజిట్ కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అమ్మో చలి అంటున్నారు జనం. నవంబర్ మాసంలోనే ఇలా ఉంటే డిసెంబర్ , జనవరిలో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. గత మూడు రోజులుగా తెలంగాణలో చలి తీవ్రత అధికమైంది. ఉదయం నిద్ర లేవాలంటేనే జనాలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో ఉష్టోగ్రతలు ఒక్క సారిగి కనిష్ట స్థాయికి పడిపోయాయి. రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల నుంచి 12.5 డిగ్రీల మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ముఖ్యంగా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపునకు పడిపోవచ్చని హెచ్చరించింది. మిగతా అన్ని జిల్లాల్లో 10-12.5 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, చలి తీవ్రతతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. ఉదయం 9 గంటల వరకు కూడా పొగ మంచు కమ్ముకుంటోంది. మంగళవారం రాత్రి అత్యల్పంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 10.2 డిగ్రీలు, లింగాపూర్‌లో 10.5, ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 11.1, బోథ్ మండలం పొచ్చెరలో 11.2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత బాగా పెరిగింది. శేర్ లింగంపల్లిలో 11.8 డిగ్రీల సెల్సియస్, రాజేంద్ర నగర్ లో12.9 డిగ్రీల సెల్సియస్,మారేడ్ పల్లిలో 13.6 డిగ్రీల సెల్సియస్ ఇబ్రంహీం పట్నంలో 11.5 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. చలికాలంలో జలుబు, ఫ్లూ, అలెర్జీలు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తాయి. చల్లని వాతావరణం వల్ల శరీరంలో వైరస్లు ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహాఇస్తున్నారు.
