పారిశ్రామిక వేత్తలకు సంపూర్ణ సహకారం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామి
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ :
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు పూర్తి సహకారం అందించడానికి సంసిద్ధంగా ఉన్నామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు.హైదరాబాద్ హైటెక్ సిటీ లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన CII తెలంగాణ స్టేట్ యాన్యువల్ మీటింగ్ 2023-24 కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గం లాంటిది. దేశంలో ఎక్కడా లేని మౌలిక వసతుల కల్పనకు మంచి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది.
ఇందిరమ్మ రాజ్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తుంది
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కొత్త ఇండస్ట్రీ పార్కుల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తున్నాం. మహిళా పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు.హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం 30 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఒకే చోట ఏర్పాటు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేసి 3000 ఎకరాల్లో అనేక చోట్ల ఫార్మా విలేజ్ లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్యన టెక్స్టైల్ గ్రానైట్ ఐటి సెక్టార్ మైన్ తదితర క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నాం.అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనువుగా ఉన్న MSME ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలో పాల ఉత్పత్తికి వినియోగం మధ్యన చాలా గ్యాప్ ఉన్నందున డెయిరీ ని డెవలప్ కు మంచి అవకాశాలు ఉన్నాయి.స్వచ్ఛమైన పాలను అందించగలిగే విధంగా డెయిరీ ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తుకు మేలు చేసిన వారం అవుతామని భట్టి విక్రమార్క అన్నారు.
- వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి
మొక్కజొన్న, టమాట, మిర్చి, పత్తి తదితర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మేలు చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించే అవకాశాలున్నాయి. వాణిజ్య పంటల ఉత్పత్తి ద్వారా రైతులు ఆర్థికంగా బలపడటంతో పాటు పరిశ్రమల యజమానులు సైతం ఆదాయం పొందుతారన్నారు. - మూసీ ప్రక్షాళన చేస్తాం
మూసి రివర్ నిర్లక్ష్యం కావడం వల్ల డ్రైనేజీగా మార్చారు.గోదావరి కృష్ణ నదులను మూసికి అనుసంధానం చేసి స్వచ్ఛమైన నీరు పారే విధంగా మూసి ప్రక్షాళన చేయబోతున్నాం.మూసి పరివాహక ప్రాంతంలో చెక్ డ్యామ్, చిల్డ్రన్ పార్క్, ఫ్లై ఓవర్స్, ఎంటర్టైన్మెంట్, బోటింగ్ తదితర ఎసెట్స్ ను పిపిపి మోడల్ లో అభివృద్ధి చేయనున్నామన్నారు. హైదరాబాదును మిగతా జిల్లాలతో కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయబోతున్నాం .ఔటర్ రింగు రోడ్డు రీజనల్ రింగ్ రోడ్ మధ్యన అనేక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నాం. నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాటిలైట్ టౌన్ షిప్స్ ఏర్పాటు చేయబోతున్నది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఐఐటి లాంటి విద్యాసంస్థలు మానవనరులను హైదరాబాదులో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాయని డిప్యూటీ సీఎం అన్నారు.