* ఓట్లను రాల్చే అక్షయ పాత్ర
* ఎన్నికల వేళ నేతల నోట కోచ్ ఫ్యాక్టరీ పాట
* ఆ తర్వాత మరుపు షరా మామూలే..
* పట్టించుకున్న నాథుడే ఉండడు
చిలుముల్ల సుధాకర్
ఆకేరు న్యూస్ , వరంగల్ : ఓరుగల్లు ప్రజల చిరకాల స్వప్నం .. నలభై నాలుగేళ్ళుగా ప్రజల డిమాండ్ … కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ( Kazipet Railway Coach Factory ) ఏర్పాటు చేయాలి. ఇదీ ఎప్పటికీ సాధ్యం కాని ఎండమావిగానే మిగిలిపోతోంది. ఎన్నికలు వచ్చిందంటే చాలు రాజకీయ పార్టీలకు ఓరుగల్లు ప్రజల పట్ల ఎక్కడ లేని ప్రేమ తన్నుకొస్తుంది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిందేనని దిక్కులు పిక్కటిల్లే విదంగా నినదిస్తారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయక పోవడానికి ప్రత్యర్థి పార్టీలే కారణమంటూ దుమ్మెత్తి పోస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు , బీజేపీ, బీఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలను మాటల తూటాలతో చీల్చి చెండాడుతారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రాకపోవడానికి కాంగ్రెస్ నేతల అసమర్థతే కారణమంటూ దుమ్మెత్తి పోస్తారు. అధికార మార్పిడి జరగగానే సీన్ రివర్స్ అవుతుంది. బీజేపీ నేతలను , కాంగ్రెస్ , బీఆర్ ఎస్ పార్టీ నేతలు సేమ్ టూ సేమ్ కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ నెరవేరక పోవడానికి బీజేపీ నేతల నిర్లక్ష్య వైఖరీ , అసమర్ధతే కారణమంటూ విమర్శల పరంపర గుప్పిస్తారు. ఈ తమాషా గత 44 ఏళ్ళుగా ఓరుగల్లు ప్రజలకు అలవాటుగా మారిపోయింది. ఎన్నికల సమయంలోనే నేతల కోతలు తప్ప ఆ తర్వాత ఆచరణకు నోచుకోవని అర్థం చేసుకుంటారు. నేతలు మాత్రం యథావిదిగా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రత్యర్థి పార్టీలను కోచ్ ఫ్యాక్టరీ రాకపోవడానికి కారణమంటూ నిందిస్తూనే ఉంటారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని పొందుపరిచారు.. మరో సారి రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ ఓట్లను రాల్చే అక్షయ పాత్ర లాగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం మారిపోయింది. అసలు ఈ కోచ్ ఫ్యాక్టరీ కథా కమామీషు ఏంటో పరిశీలిద్దాం..
* ఓరుగల్లు ప్రజల 44 ఏళ్ళ డిమాండ్ ..
భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు ( PV Narshimha RaO ) రెండు సార్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ పార్లమెంట్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1977, 1980 లో పీవీ నరసింహారావు ఎంపీగా గెలిచారు. 1984లో మూడోసారి బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. తెలంగాణ ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్న పరిస్థితి ఉండేది. అప్పటికే నక్సలైట్ ఉద్యమం ఊపందుకుంటోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలు కల్లోల ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణకు కేంద్రంగా ఉన్న వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. రెండో సారి ఎంపీగా పోటీ చేస్తున్న క్రమంలో పీవీ నరసింహారావు ఓరుగల్లు ప్రజలకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి సంబందించి హామి ఇచ్చారు. కారణాలేమైనప్పటికీ హామి మాత్రం నెరవేరలేదు. మూడో సారి పీవీ ఓటమి పాలయ్యారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం మూలకు పడింది. కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ కోసం సీపీఐ, సీపీఎం లతో పాటు అన్ని రకాల వామపక్ష పార్టీలు కలిసి వచ్చాయి. కాంగ్రెస్ ,బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కూడా గొంతు కలిపాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. ప్రజల డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును కదిలించింది. అనూహ్యంగా 1984 అక్టోబర్ 31న ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ సొంత గన్ మెన్ల చేతుల్లోనే దారుణంగా హత్య చేయబడింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సిక్కు సామాజిక వర్గం ప్రజలపైదాడులు జరిగాయి. పంజాబ్ అల్లకల్లోలంగా మారింది. ఈ గాయాలను మాన్పేందుకు ఆ తర్వాత ప్రధాన మంత్రి పదవి పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీ కాజీపేటకు మంజూరి అయిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలకు తరలించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదిగో.. కోచ్ ఫ్యాక్టరీ.. ఇదిగో కోచ్ ఫ్యాక్టరీ అనడమే తప్ప ఆచరణకు నోచుకున్నది మాత్రం లేనేలేదు. ఎవరు రైల్వే మంత్రిగా ఉంటే ఆ రాష్ట్రాలకు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మమతా బెనర్జీ , మల్లికార్జున్ ఖర్గే ల హయాంలో ఆయా రాష్ట్రాలకే భారీ పరిశ్రమల ఏర్పాటు చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదే తరహాలో ప్రదాన మంత్రి నరేంద్ర మోది కూడా కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్లో ఏర్పాటు చేశారన్న ఆరోపణలు లేక పోలేదు.
* రాష్ట్ర విభజన ఒప్పందంలో కోచ్ ఫ్యాక్టరీ
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని ఓరుగల్లు ప్రజలు మరచిపోతున్న క్రమంలో మరోసారి తెరమీదకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్రాష్ట్ర విభజన ఒప్పందం ( THE ANDHRA PRADESH REORGANISATION ACT, 2014 ) లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పొందుపరిచారు. దీంతో అడుగంటిన కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఆశలు చిగురించాయి. 2014 నుంచి అదిగో.. ఇదిగో అన్న పాత ముచ్చట్లే ఓరుగల్లు ప్రజలకు వినిపించాయి. రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ అని ఒకసారి కాదు.. కాదు .. వ్యాగన్ రిపేర్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటనలు చేస్తూ వచ్చింది. మరోసారి రైల్వే పీరియాడికల్ ఓవరాలింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామన్న ప్రకటనలు చేశారు. కోచ్ ల తయారి పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశం లేనేలేదరు కేంద్ర ప్రభుత్వ అధికారులు అప్పట్లోనే స్పష్టం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పక్కకు బెట్టి, బీజేపీ ప్రభుత్వం కావాలని అతి తక్కువ ఉపాధి అవకాశాలు లభించే రిపేరింగ్ వర్క్ షాపులను ఏర్పాటు చేయడం సరియైంది కాదని కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల నేతలు విమర్శించారు. రైల్వే వ్యాగన్ పరిశ్రమకు కోసం అవసరమైన భూములు ఇవ్వకుండా బీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ నేతలు ఎదురు దాడి చేశారు. ఎట్టకేలకు మడికొండ మెట్టు రామలింగేశ్వర స్వామికి ఆలయానికి చెందిన 160 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం రైల్వే పరిశ్రమ ఏర్పాటు కోసం ఇచ్చేసింది.
* నరేంద్ర మోది శంకుస్థాపన
గత ఏడాది జులై 8 వతేదీన కాజీపేటకు ప్రధాన మంత్రి నరేంద్ర మోది విచ్చేశారు. రైల్వే పీవోహెచ్ పరిశ్రమతో పాటు రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. రిపేర్ చేసే వర్క్ షాపుతో పాటు గూడ్స్ రైలు వ్యాగన్ల తయారీ పరిశ్రమ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నది వరంగల్ ప్రజల చిరకాల కోరిక.ఓరుగల్లు ప్రజలకు ఎప్పటికీ నేరవేరని కోరిక గానే మిగిలిపోతోంది. రాజకీయ పార్టీలకు మాత్రం ఏ ఎన్నికల్లో నైనా ఓట్లు రాల్చే అక్షయ పాత్ర లాగానే భావిస్తున్నారు..
———————————————–