ఆకేరు న్యూస్, ఖమ్మం : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 69 లక్షల మంది లబ్దిదారుల్లో ఇప్పటికే 65 లక్షల మంది రైతులకు రైతుభరోసా నిధులు ఇచ్చామని, ఈ నెల 8వ తేదీలోగా మిగిలిన బకాయిలు కూడా చెల్లిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అలా చేయకపోతే ఈ నెల 9న అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాస్తానని, అందరికీ రైతుభరోసా నిధులు అందితే ముక్కు నేలకు రాసి కేసీఆర్ క్షమాపణ చెబుతారా అని సవాల్ విసిరారు. రైతుభరోసా ఇవ్వలేదని కేసీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొత్తగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో బీజేపీ, బీఆర్ ఎస్‌లపై రేవంత్ విరుచుకుపడ్డారు. సెమీఫైన్సల్ లో బీఆర్ ఎస్ ను ఓడించామని, ఫైనల్స్ లో బీజేపీని ఓడించాలని ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మం, మహబూబాద్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులకు మంచి మెజారిటీ ఇవ్వాలని కోరారు.
కేసీఆర్ బీజేపీతో కలుస్తారు..
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, నామా కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ చెబుతున్నారని, కేసీఆర్ ను కాంగ్రెస్ దగ్గరకు రానీయదని వెల్లడించారు. ఆయన బీజేపీతోనే కలుస్తారని, ఆ విషయం తాను ముందే చెప్పానని వెల్లడించారు. వాళ్లు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నప్పటికీ, అంగన్వాడీలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తుంటే కేసీఆర్‌కు కడుపుమంటగా ఉందని విమర్శించారు. కేసీఆర్ బుద్దిని ముందే పసిగట్టిన ఖమ్మం ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ది చెప్పారని తెలిపారు.
గాడిద గుడ్డు ఇచ్చారు..
బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే.. ప్రధాని మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ అవమానించారని ఆరోపించారు. గాడిదగుడ్లు ఇచ్చినందుకు బీజేపీకి ఓటేయ్యాలా అని ప్రశ్నించారు. తెలంగాణ టీమ్ వర్సెస్ గుజరాత్ టీమ్ లో తెలంగాణ టీమ్ కు రాహుల్ నాయకత్వం వహిస్తారని, గుజరాత్ టీమ్‌ను ఓటించాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేటకు శనీశ్వారావుని వదిలిస్తా..
పంద్రాగస్టు లోపు భద్రాచలం రాములువారి సాక్షిగా.. రైతులకు రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేసి.. ఈ రాష్ట్రానికి, సిద్దిపేటకు పట్టిన చీడ, పీడ శనీశ్వరావును వదిలిస్తానని హరీశ్వరరావును ఎద్దేవా చేశారు. సవాలుకు నిలబడి ఉండాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు.
—————————