-
లక్ష్యం సరే.. ఆచరణ ఏది..?
* ప్రచారంలో కనిపించని దూకుడు
* ఇంకా పూర్తికాని అభ్యర్థుల ప్రకటన
* ఇప్పటికీ పెండింగ్‌లో 3 సీట్లు
* నేడు, రేపు అంటూ నాన్చివేత ధోరణి - ఆకేరున్యూస్ ప్రతినిధి, హైదరాబాద్ :
- అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ సర్కారు దూకుడు ప్రదర్శించింది. రోజుల వ్యవధిలోనే ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రకటించినట్లుగానే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేశారు. దాదాపు లక్ష్యం పూర్తి చేశారు కూడా. అయితే.. ఆ ప్రణాళిక వెనుక పార్లమెంట్ ఎన్నికల వ్యూహం కూడా ఉంది. మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశాలు ఉంటాయని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది. ఆ ప్రకటనకు ముందే ఆరు గ్యారెంటీలను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహం. అయితే.. ప్రతి మహిళకూ నెలకు 2,500 సాయం, రైతులకు సంబంధించి కొన్ని హామీలు వంద రోజుల్లో అమలు చేయలేకపోయింది. ఇంతలోనే ఎన్నికల షెడ్యూల్.. కోడ్ అమలులోకి వచ్చాయి.
- లక్ష్యం 12 నుంచి 15
- అధికారంలోకి వచ్చిన ఊపుమీదున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో కనీసం 12 సీట్లలో విజయం సాధించాలని భావించింది. 12తో మొదలుపెడితే.. ఆ సంఖ్య ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయని బేరీజు వేసుకుని.. లక్ష్యాన్ని పెంచుకుంది. తాజాగా మిషన్ 15 స్టార్ట్ చేసింది. ఎంఐఎం పక్కాగా గెలిచే హైదరాబాద్ సీటును వదిలేస్తే.. మిగతా 16లో ఒకటి పోయినా.. 15 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించేలా ప్రణాళికలు రచించాలని హైకమాండ్ ఆదేశించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదిశగా దృష్టి సారించారు. రాష్ట్రంలో సర్వే నివేదికలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు. అభ్యర్థులు, మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జులు అంతా ఇకపై నియోజకవర్గాలకే పరిమితమై గట్టిగా పని చేయాలని ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఇటీవల సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఎవరు పని చేస్తున్నారో, ఎవరు పని చేయడంలేదన్న ప్రోగ్రెస్ రిపోర్టు తమ వద్ద ఉందని చెప్పారు.
- ఆ స్థాయిలో ప్రోగ్రెస్ ఉందా..?
- భారీ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నారు కానీ.. పార్టీలో ఆస్థాయి వేగం కనిపించడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కొన్ని నెలలే కావడం.. అంతలోనే ఎంతో కొంత చేసిందనే పేరు ఉండడంతో.. మిగతా పార్టీల కంటే ఎక్కువ సీట్లే కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ.. మిషన్ 15 కంప్లీట్ కావాలంటే అది సరిపోదు. ప్రచారంలో వేగం పెంచాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా కనిపించడం లేదు. తుక్కుగూడ సభ ద్వారా వచ్చిన మైలేజీని పెంచుకోవడంలో కూడా నేతలు విఫలం అయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో జన జాతర సభ నిర్వహించారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరిలో కూడా ఇంకా జోరు కనిపించడం లేదు.
- ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే…
- రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలు ఉండగా.., ఇంకా మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే ఖరారు చేయలేదు. వాటిలో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, ఎంఐఎం సిట్టింగ్ స్థానంలో ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో రకరకాల వూహాగాలు వినిపిస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్-ఎంఐఎం స్నేహపూర్వక పోటీ అని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే.. ఖమ్మం సీటు కోసం బలమైన వ్యక్తులు పోటీ పడడంతో ఎంపిక విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. కరీంనగర్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడుతున్నప్పటికీ.. ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం కూడా.. కాంగ్రెస్ లక్ష్యానికి ఆటంకంగా కనిపిస్తోంది.
- అభ్యర్థులు వీరేనా..?
- పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన నేడు, రేపు అంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం సీటును మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి కేటాయించినట్లు సమాచారం. ఈ సీటు కోసం మాజీ మంత్రి మండవ, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా ఆశిస్తున్నారు. అలాగే.. కరీంనగర్ టికెట్ ను వెలిచాల రాజేందర్ రావుకు, హైదరాబాద్ టికెట్ ను సమీరుల్లాఖాన్కు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. నేటి సాయంత్రం, లేదా రేపు అధికారంగా వెల్లడి చేస్తారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటిస్తేకానీ.. కాంగ్రెస్ పార్టీలో ప్రచార జోరు కనిపించదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
- అగ్రనాయకులు రాకతోనైనా..?
- తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక, ఖర్గే తదితర ఏఐసీసీ నేతలు వస్తారని, అందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీ వేణుగోపాల్ ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. రాష్ట్రంలో ప్రచార ప్రణాళికలను ఈ నెల 18 కల్లా ఏఐసీసీకి పంపించాలన్నారు. ఈమేరకు టీపీసీసీ ప్రణాళికలు రచిస్తోంది. అగ్రనాయకుల రాకతోనైనా మిషన్ 15 ప్రచారానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో దూకుడు పెరుగుతుందా.. లేదా అనేది వేచి చూడాలి.
- —————————
Related Stories
November 24, 2024
November 24, 2024