
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
* అనారోగ్యంతో ధర్మపురి కన్నుమూత
* ప్రముఖుల సంతాపం
* నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. నా లోనే ఉంటావు..
* కుమారుడు ధర్మపురి అరవింద్ భావోద్వేగ ట్వీట్
* రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీనియర్ పొలిటీషియన్, కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ (Dharmapuri Aravind) ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావు’ అని ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. శ్రీనివాస్ మృతికి ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్లోని ఆయన పార్థీవదేహాన్ని సందర్శించి నివాళి అర్పిస్తున్నారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని సొంత స్థలంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం..
నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒకరైన ధర్మపురి అర్వింద్.. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా(బీజేపీ) ఉన్నారు. పెద్ద కుమారుడు డి.సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్ గా పని చేశారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. డి.శ్రీనివాస్ 1989, 1999, 2004లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కింది. కొంతకాలం బీఆర్ఎస్ లో కొనసాగిన డీఎస్… ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. చివర్లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. మరోవైపు అనారోగ్య సమస్యలతో డీఎస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కాంగ్రెస్ లో ఆయనది కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. డీఎస్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్, రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డీ శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించింది : ఏపీ సీఎం
ధర్మపురి శ్రీనివాస్ మృతికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు (Chandrababu Naidu) సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డీఎస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని అన్నారు. డీ.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విచారం వ్యక్తం చేశారు. వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారన్నారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిదన్న కిషన రెడ్డి, డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన, బీజేపీ ఎంపీ అరవింద్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
———————-