Annaram Dargah Hair Collection Tender Controversy
అకేరు న్యూస్ వరంగల్ : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని హజరత్ యాకూబ్ షా వలీబాబా దర్గాలో భారీ అవినీతి అక్రమాలు వెలుగుచూశాయి. రెండేళ్ల క్రితం సుమారు రూ.60 లక్షల విలువైన భక్తుల తలనీలాలను మాయం చేసిన వ్యక్తికే రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు తిరిగి మూడేళ్ల పాటు టెండర్‌ను దారాదత్తం చేయడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.
నిబంధనల ప్రకారం దర్గా తలనీలాల సేకరణ టెండర్‌ను హైదరాబాద్‌లోని వక్ఫ్ బోర్డు కార్యాలయం ద్వారా బహిరంగ వేలం వేసి కేటాయించాల్సి ఉంటుంది. రెండేళ్లుగా అన్నారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎలాంటి అధికారిక టెండర్ లేకుండానే దర్గాలోని తలనీలాలను సేకరించి, సుమారు రూ.60 లక్షల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాడు. ఈ అక్రమాలపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విచారణ చేపట్టారు. దర్గాలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు నిర్ధారిస్తూ కలెక్టర్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు నివేదిక పంపారు.
జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్, దర్గా సూపరింటెండెంట్ ముంతాజ్ హుస్సేన్ సైతం సదరు వ్యక్తి రెండేళ్ల పాటు అక్రమంగా తలనీలాలను తరలించినట్లు రాతపూర్వకంగా వక్ఫ్ బోర్డు సీఈఓకు నివేదించారు. స్పష్టమైన ఆధారాలు, నివేదికలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు సదరు అక్రమార్కుడిపై చర్యలు తీసుకోక పోగా అతడికే వత్తాసు పలకడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే వ్యక్తికి ఈ ఏడాది నుంచి మరో మూడేల్ల పాటు తలనీలాల టెండర్‌ను కట్టబెట్టడం వెనుక పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ వేలం నిర్వహించకుండా, నిబంధనలకు విరుద్ధంగా గుట్టుచప్పుడు కాకుండా టెండర్ పత్రాలు రాసివ్వడం పై మైనారిటీ వర్గాలు మండిపడుతున్నాయి. కొందరు స్వార్థపరులైన అధికారుల మూలంగా వక్ఫ్ బోర్డు ప్రతిష్ట పూర్తిగా మసకబారుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే టెండర్ రద్దు చేయాలని గ్రామస్తుల డిమాండ్..
అక్రమ టెండర్ వ్యవహారంపై వరంగల్ జిల్లా కలెక్టర్, వక్ఫ్ బోర్డు చైర్మన్, సీఈఓ, స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తక్షణమే స్పందించాలని ముస్లిం మైనారిటీ నాయకులు, అన్నారం గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా సదరు వ్యక్తి దర్గా నుంచి మాయం చేసిన రూ. 60 లక్షల సొమ్మును రికవరీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన నూతన టెండర్‌ను రద్దు చేసి, వెంటనే పారదర్శకంగా బహిరంగ వేలం నిర్వహించాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
