Cyber fraud targets companies via WhatsApp impersonation, warns CP Sajjanar urging verification before payments.
* కోట్లు కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్లు
* వాట్సాప్‌లో వచ్చే ఆర్థిక లావాదేవీల అభ్యర్థనలను గుడ్డిగా నమ్మవద్దు
* పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ ఐపిఎస్ హెచ్చరిక
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హైదరాబాద్ నగరంలో వ్యాపార దిగ్గజాలు,బడా కంపెనీల సీఈఓలు, సీఎఫ్ఓలను టార్గెట్ చేస్తూ సాగుతున్న సరికొత్త ‘ఇంపర్సనేషన్’ మోసంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ ఐపిఎస్ తీవ్ర హెచ్చరిక చేశారు. సైబర్ నేరగాళ్లు కంపెనీ ఈమెయిళ్లకు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపి, మాల్వేర్ ద్వారా కంపెనీ కి చెందిన కంప్యూటర్ల రిమోట్ యాక్సెస్ పొంది వాట్సాప్ వెబ్ సెషన్లను హ్యాక్ చేస్తున్నారని చేస్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం కంపెనీ బాస్ పేరుతో అకౌంటెంట్లకు మెసేజ్ పంపి, తాము అత్యవసర మీటింగ్‌లో ఉన్నామని, ఫోన్ ఎత్తడం వీలుకాదని నమ్మిస్తూ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో కోట్లాది రూపాయలను దర్జాగా కాజేస్తున్నారు. తమ పై అధికారుల నంబర్ నుంచే వాట్సాప్ సందేశం వస్తుండటంతో అకౌంటెంట్లు ఏమాత్రం సందేహించకుండా నగదు బదిలీ చేసి మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో వచ్చే ఆర్థిక లావాదేవీల అభ్యర్థనలను గుడ్డిగా నమ్మవద్దని, ఏదైనా సందేహం ఉంటే నేరుగా ఫోన్ చేసి ధృవీకరించుకోవాలని వి.సి. సజ్జనార్ సూచించారు. ఆఫీసు సిస్టమ్స్‌లో నాణ్యమైన యాంటీవైరస్ వాడటంతో పాటు, వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారీ తప్పనిసరిగా లాగ్అవుట్ చేయాలని, ఒకవేళ మోసపోతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సామాజిక మాధ్యమాల్లో తెలిపారు.
