Paddy Cutting CPM Demand
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
పిఎసిఎస్, ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, రైస్ మిల్లుల వద్ద రైతుల ధాన్యం డబుల్ కటింగ్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి సాదం రమేష్ అధికారులను కోరారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రి పేట ఐకెపి సెంటర్లో గాదె సాంబరాజుకి చెందిన 14 బస్తాలకు, తుప్పరి నరసింగరావు, ఉద్దెమారి వైకుంఠంలకు చెందిన 16 బస్తాలు కట్టింగ్ విధించారు. మిగతా రైతులకు ఎలాంటి కటింగ్ చేయలేదు. ఒకే సెంటర్, ఒకే గ్రామంలో సిబ్బంది రెండు విధాలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయమై సెంటర్ నిర్వాహకులను నిలదీయగా, “నీ ఒక్కనివే కాదు, మండలంలోని అన్ని సెంటర్లలో ఇలాగే అందరి ధాన్యం కట్ చేస్తున్నాం” అని రైస్ మిల్లుల వద్ద దిగుమతి కోసం బస్తాకు ₹ 3 చొప్పున వసూలు చేసి ఇస్తున్నాం” ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు అంగీకరిస్తున్నారని రమేష్ తెలిపారు. ఇటు కొనుగోలు కేంద్రం వద్ద అటు రైస్ మిల్లు వద్ద డబుల్ కటింగ్ చేస్తూ రైతులు నిట్ట నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు.
* ‘C’ గ్రేడ్ పేరుతో మోసం:
మండలంలోని అన్ని గ్రామాల రైతుల ధాన్యాన్ని A’ గ్రేడ్ అయినప్పటికీ, బలవంతంగా ‘C’ (కామన్) గ్రేడ్ కింద నిర్వాహకులు రైస్ మిల్లు కు పంపుతున్నారని ఆరోపించారు. దీనివల్ల ఒక్కొక్క క్వింటాకు రూ.40 నుండి రూ. 60ల వరకు నష్టపోతున్నారని రమేష్ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండలంలోని ఐకెపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలలో జరిగిన కొనుగోళ్లపై విచారణ జరిపించి ట్రక్కు షీట్లు, మిల్లుల రసీదులు, ఆన్లైన్ ఎంట్రీలు పరిశీలించి డబుల్ కటింగ్‌కు పాల్పడిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేసి రైతులకు న్యాయం చేకూర్చాలని జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, స్థానిక తహసిల్దార్ ను డిమాండ్ చేశారు.
