* నీళ్ళు లేక పొలాలు ఎండినయి..
* నోటి కాడి కొచ్చిన పంట నేల పాలయింది
* బావుల్లో నీళ్ళు లేవు. బోర్లు పడుత లేవు
* రైతుల ఆవేదన
ఆకేరు న్యూస్ , వరంగల్ : నోటి కాడికొచ్చిన పంట నేల పాలయింది. నీళ్ళు లేక వరి చేలు నెర్రెలు బారినయి. పొట్టకు వచ్చిన పంట నీళ్ళు లేక పోవడంతో ఎండిపోతున్నయి. మేమేం చేయాలి.. ఎట్లా బతకాలి అంటూ .. రైతులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. హనుమకొండ జిల్లా లోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లోని వంగర, రత్నగిరి, మాణిక్యాపూర్, గట్ల నర్సింగా పూర్, ఎల్కతుర్తి, ఇందిరా నగర్, ములుకనూర్ , ముస్తాఫా పూర్ , దామెర, హవల్దార్ పల్లి గ్రామాల రైతులు సాగు నీళ్ళు లేక పంటలు అక్కరకు రాకుండా పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. చేతికి అందుతుందనుకున్న సమయంలోనే భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో నీటి చుక్క లేకుండా పోయింది. దీంతో వరి పొలాలు నెర్రెలు బారినయి.ఎండి పోయిన వరి చేలల్లో పశువులను మేపుతున్నారు. ఆరుగాలం కష్టపడి ఆగం అయిపోయినామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పదేండ్లు కాలం కలిసి రావడంతో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో యాసంగి పంటలకు కూడా ఎలాంటి కొరత లేకుండా నీటి సదుపాయం లభించిందంటున్నారు. ఈ ప్రాంతాలకు సాగునీటి ప్రాజెక్ట్‌ల సౌకర్యం కూడా లేదు. గౌరవెళ్ళి ఎత్తిపోతల పథకం ఏండ్ల తరబడి వాగ్ధానాలకే పరిమితం అవుతోంది. దేవాదుల ప్రాజెక్ట్ కాలువ ఉన్నప్పటికీ కాలువలే నీళ్ళ లేక నెర్రెలు బారుతున్న పరిస్థితి కనబడుతోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో ఒక్కసారిగా వ్యవసాయ బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు దిక్కుతోచని పరిస్థతి నెలకొన్నది. పంటలు ఎండిన గ్రామాల్లో ఆకేరు న్యూస్ బృందం పర్యటించింది. దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఆకేరు విలేకరుల బృందంతో తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంత మయినారు.
* పాలిచ్చే ఆవును అమ్మి బావిలో పూడిక తీసినా ఫలితం లేదు.
గొర్రె కుమారస్వామి, దామెర.
నాకు మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేసినాను. ఇపుడు అర ఎకరం మిగిలింది. ఈ మాత్రం కూడా పండుతుందన్న నమ్మకం లేదు. ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితిని చూడలేదు. ఈ సంవత్సరం వర్షాలు పడలేదు. బావిలో నీళ్ళు లేక పోతే పూడిక తీశాను. ఇందుకోసం పాలిచ్చే ఆవును కూడా అమ్మాల్సి వచ్చిందంటు కన్నీటి పర్యంత మయ్యాడు. వరి పొలం ఎండి పోవడంతో పశువులను మేపాల్సి వచ్చింది. ఏ రైతుకు ఇట్లాంటి కష్టం రాకూడదు. పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా తిరిగి వస్తాయన్న నమ్మకం లేదు. ప్రభుత్వం ఆదుకోక పోతే ఆగమయ్యే పరిస్థితి ఉన్నది.
ఐదెకరాలు ఎండి పోయింది.
* కత్తుల ఎల్లమ్మ, హవల్దార్ పల్లి .
ఐదెకరాల్లో వరి పంట వేశాను. నీళ్ళు లేక ఐదెకరాలు ఎండి పోయింది. పంట కొద్ది రోజుల్లోనే చేతి కొస్తుందని ఆశపడ్డాను. ఇదే సమయంలో బావిలో ఒక్క సుక్క నీళ్ళు లేకుండా ఎండి పోయింది. దీంతో వరి పంట కూడా పూర్తిగా అక్కరకు రాకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే మా కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది.
——————————-