* ముఖ్యమంత్రి కొత్త పథకం పేరిట మోసం
* మూడున్నర లక్షలు స్వాహా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఏకంగా ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు.. ముఖ్యమంత్రి కొత్త పథకం ప్రారంభించబోతున్నారని, మీ కోటా కింద వంద మందికి రుణాలు ఇప్పిస్తామని చెప్పి 3.60 లక్షలు ఖాతాలో వేయించుకుని బురిడీ కొట్టించారు. తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే సైబర్ వలలో చిక్కుకున్నారు. మాయమాటలు విని లక్షలు అకౌంట్లో జమచేశారు. తీరా డబ్బులు వేశాక ఫోన్లో ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ ఎమ్మెల్యే సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దాంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. తాను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శినంటూఎమ్మెల్యేకు సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు.
ముఖ్యమంత్రి ఒక కొత్త రుణపథకాన్ని ప్రారంభించబోతున్నారని.. ఆ పథకంలో వందల మందికి లక్షల్లో రుణాలు ఇవ్వబోతున్నారని నమ్మబలికాడు. మీ కోటా కింద వంద మందికి రుణాలు అందేలా చూస్తానని నమ్మించాడు. అందుకోసం ఒక్కోవ్యక్తికి 3 వేల 6 వందల రూపాయలు కమీషన్ కావాలని కోరాడు. అది విన్న ఎమ్మెల్యే వెనకా ముందు ఆలోచించకుండా సైబర్ నేరగాడి ఖాతాలో మూడు లక్షల 60 వేలు జమ చేశాడు. ఆ తర్వాత ఫోన్లో రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించారు ఆ ఎమ్మెల్యే. వెంటనే తన పీఏ ద్వారా సీసీఎస్‌లో ఫిర్యాదు చేయించారు. ముఖ్యమంత్రి కొత్త పథకం అనగానే.. ఓ ఎమ్మెల్యే అయి ఉండి.., కమీషన్‌గా లక్షలు వేయడం చర్చనీయాంశంగా మారింది.
——————–