ఆకేరు న్యూస్ డెస్క్ : రెండున్నర గంటల సినిమాలో కింది స్థాయి నుంచి కోటీశ్వరులైన కథానాయకులు చాలా మందే ఉన్నారు. కానీ.. వాస్తవ జీవితంలో ఓ నిరుపేద రైతు ఖాతాలో తెల్లారేసరికి ఏకంగా రూ. 10 వేల కోట్లు జమ అయ్యాయి. ఎందుకో.. ఏంటో పరిశీలిస్తే ఇందులో పెద్ద ట్విస్ట్ కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని వదోహి జిల్లా నివాసి భాను ప్రసాద్, అతని కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. గత వారం అతను తన బ్యాంక్ ఖాతాను తనిఖీ చేసుకుని.. ఒక్కసారిగా గుడ్ల తేలేశాడు. తన కళ్లను తాను నమ్మలేక రెండు సార్లు చెక్ చేసుకున్నాడు. కానీ తాను చూసేది వాస్తవం అని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు. తన బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ. 99, 99,94,95,999 దాదాపు (రూ. వెయ్యి కోట్లు) జమ అయినట్లు గుర్తించాడు. ఇంత పెద్ద మొత్తం తన బ్యాంకు ఖాతాకు ఎలా వచ్చిందో తెలియక ఆందోళన చెందిన భాను ప్రసాద్.. వెంటనే బ్యాంకుకు వెళ్లి అధికారులను సంప్రదించాడు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
తన ఖాతాలో అంత డబ్బు చూసిన రైతు కంగారుగా బ్యాంకుకు పరుగెత్తాడు. అధికారులకు విషయం చెప్పాడు. దీంతో వారు విచారణ చేపట్టగా సాంకేతిక సమస్య కారణంగా రైతు ఖాతాలోకి ఇంత డబ్బు చేరినట్లు తేలింది. నిజానికి, భాను ప్రకాష్ ఖాతా కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ ఖాతా అని, సాంకేతిక సమస్య కారణంగా అతని ఖాతాలోకి భారీగా డబ్బు జమ అయినట్లు అధికారులు తెలిపారు. అనంతరం తప్పును సరిచేసి అతని ఖాతాలోని డబ్బు మొత్తం వెనక్కి తీసుకున్నారు. దీంతో రాత్రికి రాత్రే 10 వేల కోట్ల రూపాయలకు యజమానిగా మారిన భాను ప్రసాద్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేకపోయాడు. సమస్యను పరిష్కరించేంత వరకూ బ్యాంకు ఖాతాను బ్యాంకు అధికారులు అతని ఖాతాను తాత్కాలికంగా స్తంభింపజేశారు.
——————