* ఏ చౌరస్తా అయినా ఓకే
* రేవంత్ రెడ్డికి డీకే అరుణ సవాల్
* ఓ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా అవి
* భాష మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సీఎంకు హెచ్చరిక
ఆకేరు న్యూస్, మహబూబ్నగర్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో స్పందించారు. ఎవరి బాగోతం ఏంటో పాలమూరులో తేల్చుకుందాం రా.. అంటూ రేవంత్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ ను అన్నట్లు తనను అనాలని చూస్తే.. డీకే అరుణమ్మ ఊరుకోదని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రేవంత్ మాట్లాడుతూ.. గద్వాల గడీలో దొరల కన్నా.., ఫాం హౌస్ దొరల కన్నా.. కష్టపడి ప్రజల కోసం పని చేసేవారిని ఎన్నుకోవాలని అన్నారు. కాంగ్రెస్పైన, ప్రభుత్వంపైన చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ .. తమ జోలికి వస్తే ఎవరినైనా పండబెట్టి తొక్కుతామని హెచ్చరించారు. రేవంత్ వ్యాఖ్యలపై ఈరోజు డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ ఎవరి బాగోతం ఏంటో పాలమూరులో తేల్చుకుందామని, ఏ సెంటర్ అయినా ఓకే అని రేవంత్ కు సవాల్ విసిరారు. నాపై ముప్పేట దాడి చేస్తున్నారని తెలిపారు. ‘‘ నన్ను పండబట్టి తొక్కి.. ఆయన తన అభ్యర్థులను గెలిపిస్తారట. ఓ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా అవి. ఒక మహిళ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి భాష మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న తీరుకు ప్రతి పాలమూరు ఆడబిడ్డ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి’’ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 15లోగా రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్దమా అని రేవంత్ ను ప్రశ్నించారు.
——————————-