
– తుపాకులతో కాల్చేస్తున్నారు
* గ్రేటర్ హైదరాబాద్‌లో పెరుగుతున్న గన్ కల్చర్
* సీపీఐ నాయకుడి కాల్చివేతతో మరోసారి వెలుగులోకి
* గతంలోనూ పేలిన తుపాకులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
* హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నిన్న జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. శాలివాహన నగర్‌లోని పార్క్ వద్ద సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్ ను దుండగులు కాల్చి చంపారు. కారులో వచ్చిన అగంతుకులు వాకింగ్ చేస్తున్న చందునాయక్కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. భూ తగాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
* గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి హాజరై వెళ్తుండగా మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం వరిగుంతం శివారులో కాంగ్రెస్ నేత పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. అనిల్ కారు నిర్మానుష్య ప్రాంతానికి రాగానే ఆయనపై దుండుగులు కాల్పులు జరిపారు. తొలుత అతడిది యాక్సిడెంట్ గా భావించారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు అతడి శరీరంలో 4 బుల్లెట్లు గుర్తించడంతో కాల్పి చంపినట్లుగా నిర్ధారించారు.
తుపాకీ చప్పుళ్లు.. తూటాల పేలుళ్లు
తెలంగాణకు తలమానికమైన గ్రేటర్ హైదరాబాద్ లో తుపాకీ చప్పుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు ఆయుధాలను అక్రమంగా సమకూర్చుకుంటున్నారు. కారణాలేవైనా తుపాకులు పేలేవరకు పోలీసులకూ తెలియడం లేదు. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి నగరానికి వస్తున్న ఆయుధాలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఇటీవల నగరంలో జరిగిన సంఘటనలు చూస్తే ఈ పరిస్థితి అర్ధమవుతుంది. ఆయుధాలతో పాటు ఆ దందాలు చేసే వారిపైనా పూర్తి స్థాయిలో నిఘా ఉండకపోవడం మూలాన ఎక్కడపడితే అక్కడ నాటు తుపాకులు లభిస్తున్నాయి. దీంతో నేరగాళ్లు వీటిని వినియోగిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గతంలో గచ్చిబౌలిలో బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపారు.
బెదిరింపులు.. కత్తులతో దాడుల నుంచి తుపాకుల వరకు..
భూ తగాదాలే ఈ తరహా కాల్పుల ఘటనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే గతంలో ప్రత్యర్థులను నయానో.. భయానో దారికి తెచ్చుకునే వారు. రాకపోతే కత్తులతో దాడులకు పాల్పడేవారు. ఇటీవలి కాలంలో ఏకంగా తుపాకులతో కాల్పులకు తెగబడుతున్నారు. యథేచ్చగా తుపాకులు దొరుకుతుండడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఒకప్పుడు ఢిల్లీ, ముంబైలకు ఉత్తరాది నుంచి ఆయుధాలు సరఫరా అయ్యేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్‌కు ఆయుధాల అక్రమ రవాణా పెరిగినట్లు తరచూ జరుగుతున్న కాల్పుల ఘటనతో తెలుస్తోంది. సహజంగా బెదిరింపులు, దోపిడీలు, కిడ్నాపులు, హత్యలు.. ఇవన్నీ చేయాలంటే గన్స్ ఉండాలని నేరస్తులు భావిస్తున్నారు. వెంటవెంటనే సమస్య పరిష్కరించుకోవాలంటే పిస్టల్స్, రివాల్వర్స్ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రౌడీషీటర్లు, నేరస్తుల చేతుల్లోనే 80శాతం వరకు ఆయుధాలు ఉన్నాయని అంచనా. వీటిని రాజస్థాన్, మధ్య ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం పాతబస్తీలో నేరస్తులు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో అత్యాధునిక పిస్టళ్లు, తుపాకులు, రివాల్వర్లున్నాయి. హైదరాబాద్ నగరంలో పోలీసుల అనుమతితో పదివేల వరకు ఆయుధాలుంటే.. అనధికారికంగా సుమారు 35వేల వరకు ఉన్నట్లు పోలీసులు అంచనావేస్తున్నారు.
గతంలో జరిగిన కొన్ని కాల్పుల ఘటనలు..
* 01.022025 ప్రిజం పబ్ వద్ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ సైబరాబాద్ సీసీఎస్ పోలీసులపై కాల్పులు జరిపాడు. అతడి నుంచి పోలీసులు మూడు తుపాకులు, 451 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
* 16.01.2025 కర్ణాటకలోని బీదర్‌లో ఎస్బీఏ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సిఎంఎస్ వాహనంపై బిహార్ దొంగలు విరుచుకుపడ్డారు. అక్కడ రూ.87లక్షల దోచుకుని అఫ్జల్‌గంజ్ చేరుకుని, ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్‌పై కాల్పులు జరిపారు.
* 2024 నవంబర్‌లో హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వరకాలనీలో ఓ వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయి తండ్రిపై ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపారు.
* 15.01.2025 ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరేకృష్ణ బీహార్ నుంచి మూడు తుపాకులు, పది బుల్లెట్లు ఖరీదు చేసుకుని నగరానికి చేరుకున్నాడు. ఇక్కడి నేరగాళ్లకు విక్రయించే క్రమంలో రాచకొండ ఎస్వోటీ పోలీసులకు చిక్కాడు.
…………………………………………………………….