
– కొద్దిరోజులుగా పెరుగుతున్న కేసులు
– విజృంభిస్తున్న దోమలు
– వారణ పట్టని జీహెచ్ఎంసీ
– ఒక్క డెంగీ మరణమూ ఉండకూడదని కలెక్టర్ ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో డెంగీ విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వర్షాలు అంతగా పడని ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, మున్ముందు ఏంటోనని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీకి పట్టడం లేదు. వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోన్న దోమల నివారణను గాలికొదిలేసింది. ఏటా రసాయనాలు, డీజిల్, సిబ్బంది వేతనాలకు రూ.10 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నా దోమలు తగ్గడం లేదు. ఫిర్యాదు చేస్తే తప్ప ఫాగింగ్ చేయడం లేదు. సర్వేలు, ఇతరత్రా పనుల వల్లే ఎంటమాలజీ కార్మికులు ఏఎల్ఓ చేయలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు.
గుర్రపుడెక్క.. దోమలు పక్కా..
వర్షాకాలంలో ఇంటింటికీ తిరిగి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పౌరులకు సూచిస్తూ దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించాలి. కానీ గ్రేటర్‌లోని మెజార్టీ ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు. పలుచోట్ల చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించక పోవడమూ దోమల వ్యాప్తికి ప్రధాన కారణం. తవ్వి వదిలేసిన సెల్లార్లను నిర్మాణ రంగ వ్యర్థాలతో పూడుస్తామని ఏటా బల్దియా ప్రకటిస్తోంది. ఇప్పటికీ చాలా చోట్ల తవ్వి వదిలేసిన సెల్లార్లు అలానే ఉన్నాయి. వాటిలోకి వరద నీరు చేరుతుండడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. నగరంలో పారిశుధ్య నిర్వహణ పడకేసింది. నగరంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తోంది. వర్షాలు పడితే పరిస్థితి మరింత అధ్వానంగా మారడంతోపాటు వ్యాధులు విజృంభించే ప్రమాదముంది.
మూడు వందలకు పైగా కేసులు..
జీహెచ్ఎంసీ పరిధిలో జనవరి నుంచి ఇప్పటి వరకు 257 కేసులు నమోదు కాగా, కోర్ ఏరియాలోని మూడు జోన్లలో 190 వరకు కేసులు నమోదు కావడం గమనార్హం. మొత్తం కేసుల్లో ఇది 74 శాతం. సికింద్రాబాద్ జోన్ పరిధిలో అత్యధికంగా 76 కేసులు నమోదైనట్టు బల్దియా వర్గాలు చెబుతున్నాయి. ఈ జోన్‌లోని ముషీరాబాద్ సర్కిల్లో 27, సికింద్రాబాద్‌లో 18, అంబర్‌పేటలో 15 కేసులున్నాయి. చార్మినార్ జోన్లో 69 కేసులు నమోదు కాగా.. ఈ జోన్‌లోని ఫలక్‌నుమా సర్కిల్ పరిధిలో 20, మలక్‌పేటలో-14, సంతోష్‌నగర్‌లో 13 కేసులు నమోదయ్యాయి. ఖైరతబాద్ జోన్ పరిధిలో 45 కేసులు నమోదైనట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మెహిదిపట్నం సర్కిల్లో 16, కార్వాన్లో 12 కేసులున్నాయి. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్ల పరిధిలో కేసుల నమోదు తక్కువగా ఉంది.
……………………………………………………..