TGSPDCL
TGSPDCL| ఆకేరు న్యూస్, హైదరాబాద్: భవిష్యత్‌లో రాబోయే డేటా సెంటర్లు, ఐటీ పార్కులు, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేలా సమగ్ర నెట్వర్క్ ప్రణాళికలు సిద్ధం చేయాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్‌కో, డిస్కంలు సమన్వయంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించారు.
పదేళ్ల డిమాండ్‌పై అంచనా
హైదరాబాద్ కల్యాణ్నగర్లోని సీపీటీఐలో మంగళవారం నెట్వర్క్ ప్లానింగ్, సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే పదేళ్లలో విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసి మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని సీఎండీ సూచించారు.
మాధారం–ఘట్కేసర్, తిమ్మాపూర్–కందుకూర్, ఎలిమినేడు–ఇబ్రహీంపట్నం, దండుమల్కాపూర్–చౌటుప్పల్ పారిశ్రామిక కారిడార్ల కోసం టీజీఐఐసీతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
డ్యూయల్ సోర్స్ సరఫరా
డేటా సెంటర్లు, ఐటీ పార్కులు, భారీ పరిశ్రమలకు ‘డ్యూయల్ సోర్స్’ విద్యుత్ సరఫరా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. అధిక లోడ్ నమోదవుతున్న సబ్స్టేషన్లు, ఫీడర్లను గుర్తించి వాటి సామర్థ్యాన్ని పెంచే చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
అదనపు ట్రాన్స్ఫార్మర్లు
33 కేవీ, 11 కేవీ ఫీడర్లను బలోపేతం చేయడంతో పాటు 80 శాతానికి పైగా లోడ్ నమోదవుతున్న ప్రాంతాల్లో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు (పీటీఆర్) ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన భూములను ముందుగానే గుర్తించి, వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో కమర్షియల్, ఆపరేషన్స్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, వివిధ సర్కిళ్ల ఎస్ఈలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
