* రాజధానిగా అమరావతిని పునఃస్థాపిస్తాం
* రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం
* తెలుగుభాష అంతానికి జగన్ సర్కారు కంకణం
* బీజేపీ ఉండగా అలా కానీయం
* జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు
* ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా సభ
* రాయి కనపడదు కానీ.., దెబ్బ కనిపిస్తుంది : చంద్రబాబు
ఆకేరు న్యూస్, ధర్మవరం : ఏపీలో అవినీతిని, అరాచకాన్ని, ల్యాండ్ మాఫియాను అంతం చేయడానికి, తెలుగు భాష పరిరక్షణకు తెలుగుదేశం-జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టం చేశారు. పుట్టపర్తి సాయిబాబా జిల్లా ధర్మవరంలో చంద్రబాబు, అమిత్ షా ఉమ్మడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. దేశంలో రాబోయేది ఎన్డీఏ.. కాబోయే ప్రధాని మోదియే అని చెప్పారు. అభివృద్ధిని దారి మళ్లించి జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, అవినీతి రెట్టింపయిందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. మద్య నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చి, మద్యం సిండికేట్‌తో కలిసి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నిధులు ఇవ్వని కారణంగా రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద ఆస్పత్రులు వైద్యం చేయడం లేదన్నారు.
అమరావతిని ప్రపంచపటంలో నిలబెడతాం
అమరావతిని ఏపీ రాజధానిగా పునఃస్థాపించి, ప్రపంచపటంలో నిలబెడతామని అమిత్ షా ప్రకటించారు. రాజధాని పునర్నిర్మాణానికి, ల్యాండ్ మాఫియా అంతానికి టీడీపీ-జనసేన-బీజేపీ కలిసినట్లు చెప్పారు. రాయలసీమను, రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని, దేశంలో మోదీ ప్రభుత్వాన్ని నిలబెడితే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో తెలుగుభాష అంతానికి జగన్ పూనుకున్నారని, బీజేపీ ఉండగా తెలుగుభాషను అంతం కానీయబోమని అమిత్ షా పేర్కొన్నారు.
మోదీతోనే దేశం సురక్షితం
ప్రధానమంత్రిగా మోదీ ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని అమిత్ షా చెప్పారు. రెండు దశల్లో పూర్తయిన ఎన్నికల్లో మోదీ సెంచరీ కొట్టారని, మూడో దశ ఎన్నికల్లో 400 దాటి ముందుకు వెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీకి ప్రధాని అయ్యే అర్హత ఉందా అని ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయితేనే ఉగ్రవాదం, నక్సలిజం సమాప్తం అవుతుందని, దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందని అన్నారు. మూడు కోట్ల అక్కాచెల్లెళ్లను లక్షాధికారులను చేయడం, నాలుగు కోట్ల పేదలకు ఇళ్లు నిర్మించడం, పది కోట్ల మంది పేదల ఇళ్లకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందించడం తమ లక్ష్యం అని చెప్పారు. అనంతరం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ జగన్ రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. రాయి కనపడుదుకానీ, దెబ్బ కనిపిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
—————————