
నిర్మల్ జనజాతర సభ లో రాహుల్ గాంధీ
* రిజర్వేషన్లను తొలగించే ప్రమాదం
* ఏ వర్గం వారి వద్ద ఎంత సొమ్ము ఉందో బయటకు తీస్తాం
* నిర్మల్ సభలో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హెచ్చరించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగించే ప్రమాదం ఉందని చెప్పారు. నిర్మల్ లో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభకు రాహుల్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకం అని చెప్పారు. 50శాతం ఉన్న రిజర్వేషన్ల పరిమితికి కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పారు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహం అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతున్నామని, ఏ వర్గం వారి వద్ద ఎంత సొమ్ము ఉందో తెలుసుకోబోతున్నామని వెల్లడించారు. ఆదివాసీలు అంటే హక్కులు మొదటిసారిగా పొందే అర్హత ఉన్న వారని తెలిపారు. ఆదివాసీలకు అన్ని హక్కులూ కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రజాప్రభుత్వం కేంద్రంలో కూడా ఏర్పడబోతోందని తెలిపారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించామని పేర్కొన్నారు. కొమరం భీమ్ స్ఫూర్తితో ఆత్రం సుగుణను గెలిపించాలని రాహుల్‌గాంధీ కోరారు. ఆదిలాబాద్ చరిత్రలో ఇప్పటి వరకు మహిళకు అవకాశం దక్కలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క తదితరులు హాజరయ్యారు.
——————————-