* రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం
* శ్రావణ సోమవారం శోభ
ఆకేరు న్యూస్, వేములవాడ : శ్రావణమాసం సందర్భంగా వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర ఆలయం భక్తజనసంద్రంగా మారింది. శ్రావణమాస శోభతో వెల్లివిరుస్తోంది. సోమవారం వేకువజామునే స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో రాజన్న దర్శనానికి 3 గంటలకుపైగా సమయం పడుతున్నది. పెద్ద సంఖ్యలో భక్తులు తమ వంతు కోసం క్యూలైన్లలో వేచిఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత, అన్న పూజల సేవలను అధికారులు రద్దు చేశారు. శ్రావణ సోమవారం కావడంతో రాజన్న (Rajanna)కు స్వామివారికి మహాన్యాస పూర్వ ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు పుట్టు వెంట్రుకలు సమర్పించి అభిషేకాలు జరిపించుకుని, కుంకుమార్చన నిర్వహించుకుని, శివకళ్యాణం, చంఢీయాగం, పల్లకిసేవ, పెద్ద సేవ లాంటి పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుంటున్నారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ నేలలో అన్ని సోమవారాల్లో శివుడికి ప్రత్యేక రుద్రాభిషేకాలు, మహా లింగార్చన నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
————————-