Hanumakonda petrol shortage clarification
* పెట్రోల్ బంకుల్లో క్యూ కట్టొద్దు – అదనపు కలెక్టర్ వెల్లడి
* బాటిళ్లలో పెట్రోల్ పోయడంపై ఆంక్షలు
ఆకేరు న్యూస్, హన్మకొండ: హనుమకొండ జిల్లాలో పెట్రోలు, డీజిల్ ఇంధన కొరత లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి స్పష్టం చేశారు. జిల్లాలో ఇంధన సరఫరా మరియు నిల్వలపై మంగళవారం కలెక్టరేట్ లో పెట్రోలియం సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఆయన ‘ఎనర్జీ కమిటీ సమన్వయ సమావేశం’ నిర్వహించారు.
* నిల్వలు పుష్కలం – అసత్య ప్రచారాలు నమ్మకండి…
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తగినంత ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పెట్రోలియం సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు సరఫరా జరుగుతోందని, కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. ప్రజలు భయాందోళనతో బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదని సూచించారు.
* బంకు నిర్వాహకులకు కీలక ఆదేశాలు
సమావేశంలో అదనపు కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్ బంకులకు వచ్చే వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంటనే ఇంధనం నింపాలి. పట్టణ ప్రాంతాల్లో బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్ పోయడం వల్ల వాహనదారులకు ఇబ్బంది కలుగుతోందని, దీనిపై నియంత్రణ ఉండాలని ఆదేశించారు. కొరత ఉందన్న పుకార్లను నమ్మవద్దని పెట్రోలియం సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
* సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఈ సమీక్షలో జిల్లాలో వివిధ కంపెనీలకు (IOCL, HPCL, BPCL) చెందిన నిల్వల వివరాలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎండి వాజీద్ అలీ, జిల్లా రవాణా శాఖ అధికారి వేణుగోపాల్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి (DWO) విశ్వజ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ప్రేమకళా, మరియు వివిధ పెట్రోలియం సంస్థల సేల్స్ మేనేజర్లు పాల్గొన్నారు.
జిల్లా యంత్రాంగం నిరంతరం ఇంధన సరఫరాను పర్యవేక్షిస్తోంది. ఏదైనా బంకులో కావాలని కృత్రిమ కొరత సృష్టించినా లేదా నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
